ఆ తల్లికి ఎంత కష్టం వచ్చింది! | - | Sakshi
Sakshi News home page

ఆ తల్లికి ఎంత కష్టం వచ్చింది!

May 13 2026 1:32 AM | Updated on May 13 2026 1:32 AM

‘అడ్డాల నాడు బిడ్డలు కానీ.. గడ్డాల నాడు బిడ్డలు కాదు’ అనేది సామెత. అది అక్షర సత్యమవుతున్న సంఘటనలు అక్కడక్కడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఎర్రగుంట్ల పట్టణంలో జరిగింది. నవమాసాలు మోసి.. కనిపెంచిన తల్లికి కనీసం అన్నం పెట్టలేదు కన్న కొడుకులు. వృద్ధురాలైన అమ్మను, కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సింది పోయి.. పట్టించుకోవడం మానేశారు. చివరికి ఆమె పోలీసులను ఆశ్రయించి.. అనాథాశ్రమానికి వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది.

జమ్మలమడుగు(ఎర్రగుంట్ల) : ఎర్రగుంట్ల పట్టణానికి చెందిన సుగుణమ్మ అనే వృద్ధురాలు తన కుమారులు తనకు అన్నం పెట్టకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయంపై ఆమె మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీఐ విశ్వనాథ్‌రెడ్డి సుగుణమ్మ బాధ అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఐ సుగుణమ్మ కుమారులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలను పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేసిన తర్వాత వారిని పట్టించుకోకపోవడం సరైంది కాదన్నారు. తల్లిదండ్రులను పొషించే బాధ్యత పిల్లలపైనే ఉందన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. అనంతరం సుగుణమ్మ కోరిక మేరకు తిప్పలూరులో ఉన్న ఎద్దుల పెద్ద శేషయ్య అనాథాశ్రమానికి చెందిన నిర్వాహకుడు నాగేంద్రకు స్టేషన్‌కు పిలపించుకుని.. ఆమెను బాగా చూసుకోవాలంటూ సూచించారు. ఆమెను ప్రత్యేక ఆటోలో తిప్పలూరు అనాథశ్రమానికి తరలించి సీఐ మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ నాగమురళి, సిబ్బంది పాల్గొన్నారు.

అందరూ ఉండి

అనాథగా మిగిలిన అమ్మ

కుమారులు అన్నం పెట్టడం

లేదంటూ ఆవేదన

పోలీసులను ఆశ్రయించిన వైనం

Advertisement
 
Advertisement
Advertisement