కురబలకోట : మండలంలోని కంటేవారిపల్లి హైవేలో సిమెంట్ ఖాళీ బస్తాల లోడుతో వెళ్తున్న లారీ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కలకలం రేగింది. నడి రోడ్డుపై వెళుతున్న లారీ మంటల్లో చిక్కుకోవడంతో అక్కడి స్థానికులు, ప్రయాణికులు, వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. మంగళవారం రాత్రి పది గంటల ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనపై ఫైరింజన్‌కు సమాచారం ఇచ్చినా సకాలంలో రాకపోవడంతో లారీ మంటల్లో తగలబడిపోయింది. డ్రైవర్ సురేష్ గమనించి లారీ నుంచి వెంటనే దిగేయడంతో సురక్షితంగా బయటపడ్డాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చైన్నె నుంచి బెల్గాంకు సిమెంట్ ఖాళీ బస్తాల లోడుతో ఆ లారీ వెళ్తుండేది. లారీ కంటేవారిపల్లి వద్దకు రాగానే ఒక్కసారిగా వెనుక టైరు పగిలిన శబ్దం వచ్చింది. అనుమానం వచ్చి డ్రైవర్ సురేష్ బండి దిగి చూడగా అప్పటికే లారీ నుంచి మంటలు చెలరేగాయి. వెనుక టైరు పగిలి పక్కనే ఉన్న డీజిల్ ట్యాంకు దెబ్బతినడంతో మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు లారీని కమ్ముకున్నాయి. చూస్తుండగానే మంటలు లారీ మొత్తం వ్యాపించాయి. మంటలు నిలువునా ఎగసి పడుతుండడంతో ఆర్పడానికి ఎవరూ సాహసించలేకపోయారు. వెంటనే ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. ఫైరింజన్ రావడానికి ఆలస్యం అయ్యింది. అందరూ చూస్తుండగానే లారీ కాలిపోయింది. లారీతోపాటు సిమెంటు బస్తాలు పూర్తిగా కాలిపోవడంతో రూ. 50 లక్షలకు పైగా నష్టం సంభవించి ఉంటుందని ప్రాథమిక అంచనా. తర్వాత ఫైరింజన్ రావడంతో మంటలను అదుపులోకి తెచ్చారు. డ్రైవర్ సురేష్ సకాలంలో మంటలను గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే విషాదకర పరిస్థితులు చోటుచేసుకునేవని స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ముదివేడు పోలీసులు తెలిపారు.
ఫైరింజన్ సకాలంలో రాకపోవడంతో తీవ్ర నష్టం


