చక్రాయపేట : గండి ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో మంగళవారం రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. ఆయనకు దేవదాయ శాఖ ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్, ఆలయ కార్యనిర్వహణాధికారి గురుప్రసాద్ ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున ఆయన తెచ్చిన పట్టు వస్త్రాలను స్వామి వారికి సమర్పించారు. అనంతరం పలు పూజల్లో పాల్గొని గత ప్రభుత్వంలో గండి అభివృద్ధికి మంజూరు చేసిన రూ.28.5 కోట్ల పనులకు సంబంధించిన శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యేలు మాధవీరెడ్డి, ఆదినారాయణరెడ్డి, కృష్ణచైతన్యరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, బీటెక్ రవి, రితేష్‌రెడ్డిలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఆలయాలకు పెద్ద పీట వేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెంకటస్వామి, పాలకమండలి సభ్యులు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పాల్గొన్నారు.
సహజత్వం లేకుండా గోపురాలపై
ఈ రంగులేంటి?
సంస్కృతి సంప్రదాయాలతోపాటు సహజత్వం ఉట్టిపడేలా రాతితో నిర్మించిన ఆలయంలో గోపురాలకు ఈ రంగులేంటని రాష్ట్ర దేవదాయ ధర్మదాయశాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవాలను పురస్కరించుకొని ఆయన మంగళవారం గండికి విచ్చేశారు. ఈ సందర్భంగా కుంభాభిషేక ఏర్పాట్లపై పరిశీలించారు. స్వామి వాహనమైన ఒంటె, బలిపీఠాలకు వేసిన రంగులపై కూడా ఆయన పెదవి విరిచారు. వెంటనే వాటికి రంగులను తొలగించి సహజత్వం కనిపించేలా చేయాలన్నారు. పారిశుధ్య చర్యలు కూడా అధ్వానంగా ఉన్నాయని ఆగ్రహించారు. ఈ సందర్భంగా పలువురు గండిలో జరుగుతున్న అక్రమాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఏమైనా ఉంటే తనకు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టండి అని సూచించారు. ఆయన వెంట రాష్ట్ర స్థపతి పరమేశ్వరప్ప, కడప దేవదాయ శాఖ సహాయ కమిషనర్ శంకర్ బాలాజీ తదితరులు ఉన్నారు.


