వాల్మీకిపురం : క్రీడల్లో రాణించినప్పుడే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని స్థానిక సీఐ రాఘవ రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక సీడీసీఏ, జీవీఎస్‌సీఎస్ క్రికెట్ క్రీడా మైదానంలో జరుగుతున్న (చిత్తూరు ప్రీమియర్ లీగ్) సీపీఎల్–2 సీజన్ క్రికెట్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. మంగళవారం జరిగిన క్రికెట్ పోటీల్లో ఉదయం నితిన్ వారియర్స్, ఎన్‌కే స్పోర్ట్స్ క్రికెట్ జట్లు పోటాపోటీగా తలపడ్డాయి. ఈ పోరులో నితిన్ వారియర్స్ క్రికెట్ జట్టు విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే మధ్యాహ్నం పాయ్ వైస్రాయ్ క్రికెట్ జట్టు, హై పెరియన్ క్రికెట్ జట్టు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో హైపెరియన్ జట్టు విజయం సాధించింది. నితిన్ వారియర్స్ జట్టులోని ఆల్ రౌండర్ ఆశిష్ రెడ్డి ప్రత్యర్థి జట్టుపై నాలుగు వికెట్లు తీయడంతో పాటు 54 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలచాడు. అనంతరం జరిగిన కార్యక్రమంలో స్థానిక సీఐ రాఘవ రెడ్డి పాల్గొని, ఆశిష్ రెడ్డికి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డును అందించారు. కార్యక్రమంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ విజయ్‌కుమార్, చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు శ్రీధర్ కుమార్, సెక్రటరీ సతీష్ యాదవ్, కోచ్ సునీల్ కుమార్, సీనియర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.


