కడప కోటిరెడ్డిసర్కిల్: మనుషులంతా ఒక్కటేనని, హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని చాటిచెప్పి శాంతితోనే జిల్లా అభివృద్ధి సాధ్యమని నిరూపించడం అభినందనీయమని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్‌లు తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం సాయంత్రం కడప నగరంలో జరిగిన శోభా యాత్రలో ముస్లిం సోదరులు హిందు సోదరులను ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. యాత్రలో పాల్గొన్న హిందూ సోదరులకు ఒకరికొకరు ఆప్యాయంగా మజ్జిగ, నీరు, పానీయాలు అందించారు. ఈ సందర్బంగా ఎస్పీ తదితరులు మాట్లాడుతూ ఇది హిందూ– ముస్లిం ఐక్యతను ప్రతిబింబిస్తుందన్నారు. హిందూ ముస్లిం అంతా ఒక్కటే అందరు కలిసి ముందుకు పోవాలన్నారు. కడప నగరంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ లు అందరు కలిసి మెలిసి ఉన్నారన్నారు. నగరంలో అందరూ కలిసి, మెలిసి ఉండాలనే భావనలో ఉన్నారని, కడపలో ఇటీవల జరిగిన ఘటనకు సంబంధించి తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, హిందూ ముస్లిం సోదరులలోని అమాయకులను జిల్లా పోలీస్ శాఖ పరిగణనలోకి తీసుకుని న్యాయం చేస్తుందని ఎస్పీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, మాధవిరెడ్డి, నేతలు అమీర్‌బాబు, అఫ్జల్‌ఖాన్, శ్రీనివాసులరెడ్డి, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి, హిందూ, ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఎస్పీ షెల్కే సచికేత్ విశ్వనాథ్, చిత్రంలో హిందూ, ముస్లిం నేతలు
శోభాయాత్రలో స్వామి వారు


