పీలేరురూరల్: జిల్లాలో జలధార పనులు, సాగునీటి వనరులు, ఉద్యాన పంటలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ నిశాంత్‌కుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని రేగళ్లు పంచాయతీ కమ్మపల్లె వద్ద అమ్మచెరువు బోడిగుట్ట నుంచి వచ్చే ఫీడర్ ఛానల్, బాలంవారిపల్లె పంచాయతీ గుర్రంవారిపల్లె వద్ద కొత్తనకుంట నుంచి సెట్టిగుంటకు వచ్చే ఫీడర్ ఛానల్ ఉపాధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ గొలుసుకట్టు చెరువుల ద్వారా దాదాపు ఆరు చెరువులు నిండే అవకాశం ఉందని తెలిపారు. అగ్రహారం చెరువు అభివృద్ధికి తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రాయితీలు, పంటల బీమా, ఉద్యాన అభివృద్ధి పథకాలు సద్వినియోగం చేసుకుని రైతులు అధిక ఆదాయం పొందాలన్నారు. అనంతరం కేవీపల్లె మండలం అడవిపల్లె రిజర్వాయర్ పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ పనులు పూర్తి చేయడానికి అవసరమైన కార్యచరణను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇరిగేషన్ ఎస్‌ఈ విఠల్ ప్రసాద్, రిటైర్డ్ ఎస్‌ఈ వెంకటరామయ్య, డ్వామా పీడీ వెంకటరత్నం, ఉద్యానశాఖ అధికారిణి సుభాషిణి, డీపీవో రాధమ్మ, తహశీల్దార్ శివకుమార్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్


