గంగలో రైల్వే పరువు! | - | Sakshi
Sakshi News home page

గంగలో రైల్వే పరువు!

May 12 2026 5:42 AM | Updated on May 12 2026 5:42 AM

గంగలో రైల్వే పరువు!

ప్రయాణికులూ.. ప్రశ్నించండి

రాజంపేట: భారతీయ రైల్వే పరువు గంగపాలవుతోంది. ప్రయాణికులకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో, ముఖ్యంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న ఈ సమయంలో బోగీల్లో నీటిని నింపడంలో రైల్వే యంత్రాంగం దారుణంగా విఫలమవుతోంది. అడిగే నాథుడు లేక, పట్టించుకునే అధికారులు లేక ప్రయాణికులు ’ఆపుకోలేని’ సమస్యతో నరకయాతన అనుభవిస్తున్నారు.

ప్రైవేటీకరణే అసలు గండం

గతంలో రైళ్లలో నీటిని నింపే బాధ్యత రైల్వే అధికారుల పర్యవేక్షణలో ఉండేది. కానీ మూడేళ్ల క్రితం ఈ ప్రక్రియను ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించిన నాటి నుంచి నిర్వహణ గాలికి వదిలేశారు. రైలు బయలుదేరే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌పై ఉన్న పైపుల ద్వారా ట్యాంకులను పూర్తిస్థాయిలో నింపడం లేదు. టైమ్‌ సరిపోలేదనో, పైపులైన్లలో ప్రెషర్‌ లేదనో సాకులు చెబుతూ సగమే నింపుతున్నారు. ఫలితంగా రైలు బయలుదేరిన నాలుగు గంటలకే ట్యాంకులు ఖాళీ అవుతున్నాయి. ఏసీ బోగీల్లో తప్ప స్లీపర్‌, జనరల్‌ బోగీల్లో కుళాయిలు వెక్కిరిస్తున్నాయి.

దుర్గంధం.. అపరిశుభ్రత:

టాయిలెట్లలో నీళ్లు రాకపోవడంతో ప్రయాణిలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నీరు లేకున్నా అలాగే వాడుతుండటంతో బోగీల్లో దుర్గంధం వెదజల్లి అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. మహిళలు, వృద్ధులు, పసిపిల్లలు ఈ దుర్భర పరిస్థితిని భరించలేక నరకం చూస్తున్నారు. రైలు ఏదైనా స్టేషన్‌లో ఆగగానే ఖాళీ సీసాలతో ప్లాట్‌ఫామ్‌ వైపు పరుగులు తీయడం నిత్యం కనిపిస్తున్న దృశ్యం. టీసీలకు ఫిర్యాదు చేసినా ‘మా చేతుల్లో ఏమీ లేదు‘ అనే సమాధానమే వస్తోంది.

నందలూరుకు ‘నీటి’ మోక్షమెప్పుడో?

చైన్నె–ముంబై రైలు కారిడార్‌లో నందలూరు అత్యంత కీలకమైన సెంటర్‌ పాయింట్‌. ఇక్కడ వాటరింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తే సగం రైళ్లలో నీటి సమస్య తీరుతుందని రైల్వే క్షేత్రస్థాయి వర్గాలు మొత్తుకుంటున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. ఇదే అంశంపై ఇటీవలే ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి రైల్వే మంత్రిని కలిసి విన్నవించారు. ఎంపీలు పీవీ మిథున్‌రెడ్డి, మేడా రఘునాథరెడ్డి కూడా నందలూరులో వాటరింగ్‌ పాయింట్‌ పునరుద్ధరించాలని ఒత్తిడి తెచ్చారు. అయినా సరే, రైల్వే బోర్డు మొండివైఖరి ప్రయాణికులకు శాపంగా మారింది.

మాకు ఫిర్యాదులేమీ రాలేదు.. అంతా బానే ఉంది‘ అంటూ అధికారులు సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. బోగీల్లో నీళ్లు రానప్పుడు, అపరిశుభ్రత ఉన్నప్పుడు ప్రయాణికులు మౌనంగా ఉండకుండా తక్షణమే 139 నంబర్‌కు కాల్‌ చేయాలని లేదా రైల్వే యాప్‌ ద్వారా ఎస్‌ఎమ్‌ఎస్‌ ద్వారా ఫిర్యాదు చేయాలని రైల్వే వర్గాలే సూచిస్తున్నాయి. ప్రయాణికులు మేల్కొని ప్రశ్నిస్తేనే వారి యాతనకు ముగింపు లభిస్తుంది.

మధ్యలోనే నీటి ట్యాంకులు ఖాళీ

దుర్గంధంతో బోగీల్లోని మరుగుదొడ్లు

రైళ్లకు నీళ్ల కోసం నందలూరే సెంట్రల్‌ పాయింట్‌

రైళ్ల వాటరింగ్‌కుకోవిడ్‌–19 ముందు సర్వే

బోగీలోని ప్రయాణికులకు సమ్మర్‌ ప్రభావం

ప్రధానరైలుమార్గం: ముంబాయి–చైన్నె

రైళ్లు: 30 (అప్‌ అండ్‌ డౌన్‌)

స్టేషన్లు: 25

ప్రతి రైలుల్లో నీటి సమస్య ఉత్పన్నం

ప్రతి రైలుల్లో నీటి సమస్య ఉందనేది నిత్యసత్యం. నేను హరిప్రియలో ఇటీవల ప్రయాణిస్తే నీళ్లులేవు. లాంగ్‌ ట్రైన్స్‌ అయితే నీళ్లు అయిపోతే, అడిగే నాథుడే లేకుండా పోతున్నాడు. తిరుమల, ఇంటర్‌సిటీ, హరిప్రియ, చైన్నె–ముంబై రైళ్లలో నీటి నిల్వలు ఎప్పుడో అయిపోయింటాయి. నీటి వాడకం లేకపోవడంతో దుర్గంధపూరితంగా మారిపోతున్నాయి. గుత్తి–రేణిగుంట మధ్య అటు చైన్నె, ఇటు ముంబై రైళ్లకు సెంటర్‌పాయింట్‌గా నందలూరులో వాటరింగ్‌ సౌకర్యం కల్పిస్తే ప్రయాణికులకు నీటి సమస్య తీరుతుంది.

–వేపగుంట శ్యామ్‌రాజ్‌, సంఘసేవకుడు, నందలూరు రైల్వేకేంద్రం

దూరప్రాంత రైళ్లలో నీటి సమస్య ఽఅధికమే

జిల్లా మీదుగా నడిచే దూరప్రాంత రైళ్లలో నీటి సమస్య అధికంగా ఉంది. ప్రయాణికులకు నీటి సమస్య లేకుండా చూద్దామనే ఆలోచన రైల్వే శాఖకు లేదు. ప్రయాణికుల నుంచి చార్జీలు ముక్కుపిండి వసూలు చేస్తారు. బోగీలలో మెరుగైన సౌకర్యాలు ఉండవు. గుత్తి–రేణిగుంట మధ్య రైళ్ల మరుగుదొడ్లలో నీళ్లుండవు. సెంటర్‌పాయింట్‌గా నందలూరులో రైళ్ల వాటరింగ్‌ పెడితే ఈ మార్గంలో బోగీలలో నీటి సమస్య తీరుతుంది. –సయ్యద్‌ జుల్ఫీకర్‌, వరల్డ్‌ హ్యుమన్‌ రైట్స్‌కౌన్సిల్‌

Advertisement
 
Advertisement
Advertisement