కడప రూరల్: వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో సోమవారం రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా స్టాఫ్ నర్స్ నుంచి హెడ్ నర్స్‌గా పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహించారు. మొత్తం 24 మందికి గాను 21 మంది పదోన్నతులు పొందారు. ఈ సందర్భంగా ఆ శాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రామగిడ్డయ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలు, నిబంధనల ప్రకారం ప్రమోషన్‌లు కల్పించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ నాగరత్నమ్మ, సూపరిండెంట్ శ్రీనివాసులు, సీనియర్ అసిస్టెంట్ వనిష తదితరులు పాల్గొన్నారు.
కడప కోటిరెడ్డిసర్కిల్: గతంలో ఓకా–మధురై–ఓకా మధ్య స్పెషల్ రైలు నడిచేదని, దాని స్థానంలో ఓకా–తిరుపతి (19560), తిరుపతి–ఓకా (19559) వీక్లీ రెగ్యులర్ రైలుగా నడుపుతున్నారని కడప రైల్వే కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. ప్రతి సోమవారం ఓకాలో రాత్రి 11.35 గంటలకు బయలుదేరి ద్వారక, కంబాలియా, జామ్‌నగర్, రాజ్‌కోట్, సురేంద్రానగర్, అహ్మదాబాద్, వడోదర, సూరత్, అకోల, నాందేడ్, నిజామాబాద్, కరీంనగర్, కాచిగూడ, మహబూబ్‌నగర్, కర్నూలు, డోన్, తాడిపత్రి మీదుగా కడపకు మరుసటిరోజు సాయంత్రం 5.55 గంటలకు చేరుకుని, అక్కడి నుంచి రాజంపేట, రేణిగుంట మీదుగా తిరుపతికి రాత్రి 11.30 గంటలకు చేరుతుందన్నారు. ప్రతి గురువారం తిరుపతిలో ఉదయం 8.15గంటలకుబయలుదేరి ఇదే మార్గంలో శనివారం రాత్రి 11.50 గంటలకు ఓకా చేరుతుందన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కడప అర్బన్: రాష్ట్ర జైలు శాఖ ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే ములాఖత్‌కు అవకాశం ఉంటుందని కడప కేంద్రకారాగారం సూపరింటెండెంట్ రాజేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండుటెండల నుంచి రక్షణ పొందడానికి వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ములాఖత్‌కు వచ్చే వారు మారిన సమయాన్ని గుర్తించి, అధికారులకు సహకరించాలని కోరారు.
చక్రాయపేట: గండి వీరాంజనేయ స్వామి నూతన ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవంలో భాగంగా నాలుగోరోజు సోమవారం పలు కార్యక్రమాలను వేద పండితులు నిర్వహించారు.ఇందులో భాగంగా శ్రీమద్రామాయణ మహాయజ్ఙం, తుంబూర వేషాలంకారంతో పాటు నాగవళ్లి దళాలతో(తమలపాకులతో) సహస్ర నామార్చన నిర్వహించారు.అనంతరం శాత్తమొరై జరిపారు.భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ప్రొద్దుటూరు కల్చరల్: భారత తపాలా శాఖ ఆధ్వర్యంలో పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్రచారార్థం జయహో బీమా సంకల్ప్ మెగా మేళాను ఈనెల 20 నుంచి 22 వరకు నిర్వహించనున్నట్లు ప్రొద్దుటూరు డివిజన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ జి.కిరణ్ సోమవారం తెలిపారు. ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలోని అన్ని పోస్టాఫీసులలో జయ హో బీమా సంకల్ప్ నిర్వహించనున్నట్లు ఆయ న పేర్కొన్నారు. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తక్కువ ప్రీమియంతో అధిక బోనస్ రేట్లు అందిస్తూ, ఇతర బీమా సంస్థలతో పోలిస్తే ప్రజ లకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రతి గ్రామస్తుడు తమ సమీపంలోని పోస్టా ఫీసు ద్వారా రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ పథకంలో చేరవచ్చని పేర్కొన్నారు.


