ప్రభుత్వ స్థలం దర్జాగా కబ్జా | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ స్థలం దర్జాగా కబ్జా

May 12 2026 5:42 AM | Updated on May 12 2026 5:42 AM

రాత్రికి రాత్రే వెలుస్తున్న అక్రమ షెడ్లు

పట్టించుకోని హౌసింగ్‌ శాఖ అధికారులు

మదనపల్లె టౌన్‌ : అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె బసినికొండలో ప్రభుత్వ స్థలాలు కబ్జాదారుల పాలవుతున్నాయి. నిర్మిత కేంద్రం స్థలంలో రాత్రికి రాత్రే అక్రమ షెడ్లు వెలిసినా హౌసింగ్‌ శాఖ అధికారులు, సచివాలయ సిబ్బంది పట్టించు కోవడం లేదు.పేదలకు తక్కువ ధరకు ఇసుక, సిమెంట్‌, నిర్మాణ సామగ్రి అందించేందుకు ప్రభుత్వం 1990లో నిర్మిత కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. సుమారు 80 సెంట్ల స్థలాన్ని కేంద్రానికి కేటాయించారు. ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం ఈ స్థలం విలువ రూ.20 కోట్ల పైమాటే. గతంలో ఈ స్థలంలో నిర్మిత కేంద్రం కార్యాలయం, గోడౌన్‌ నడిచేవి.

రాత్రికి రాత్రే షెడ్లు

కొంతకాలంగా నిర్మిత కేంద్రం కార్యకలాపాలు నిలిచిపోవడంతో కబ్జాదారుల కన్ను పడింది. గత వారం రోజులుగా రాత్రి వేళల్లో మట్టితోలి జేసీబీతో స్థలాన్ని చదును చేసి రేకుల షెడ్లు, తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. ఇప్పటికే కొన్ని ఇళ్లు, ఐదు షెడ్లు, వాటర్‌ సర్వీస్‌ కేంద్రం వెలిశాయి. మరికొన్ని పునాదుల స్థాయిలో ఉన్నాయి.

అధికారుల నిర్లక్ష్యం

నిర్మిత కేంద్రం స్థలం హౌసింగ్‌ శాఖ పరిధిలోకి వస్తుంది. కానీ జిల్లా హౌసింగ్‌ ఈఈ, డీఈలు క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే కబ్జాకు గురైన స్థలానికి ఆనుకునే బసినికొండ గ్రామ సచివాలయం ఉంది. సచివాలయ సిబ్బంది, వీఆర్వో కళ్లముందే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిన్నాయి. స్థానికులు ఫిర్యాదు చేసినా ‘మాకు సంబంధం లేదు‘ అని దాటవేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

నిబంధనలు గాలికి

ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యత రెవెన్యూ, సచివాలయ సిబ్బందిపై ఉంది. అక్రమ నిర్మాణాలు చేపడితే వెంటనే తహసీల్దార్‌కు నివేదించి తొలగించాలి. ఏపీ ల్యాండ్‌ ఎన్‌న్‌క్రోచ్‌మెంట్‌ యాక్ట్‌–1905 ప్రకారం నోటీసు ఇచ్చి 7 రోజుల్లో ఖాళీ చేయించాలి. కానీ ఇక్కడ నెల రోజులుగా కబ్జా జరుగుతున్నా ఒక్క నోటీసు కూడా ఇవ్వలేదు.

ప్రజల ఆగ్రహం

జిల్లా కేంద్రంలోనే ప్రభుత్వ స్థలం కబ్జాకు గురవుతుంటే మారు మూల గ్రామాల పరిస్థితి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిర్మిత కేంద్రం స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించాలని సీపీఎం నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. 24 గంటల్లో ఆక్రమణలు తొలగించకపోతే కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. దీనిపై హౌసింగ్‌ ఈఈని వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement