కడప ఎడ్యుకేషన్ : నూతన ఆవిష్కరణల దిశగా యువత ఆలోచించి పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వాలని డాక్టర్ వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ బి. జయరామిరెడ్డి సూచించారు. కడప లోని డాక్టర్ వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో సోమవారం జాతీయ సాంకేతిక దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ బి. జయరామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు సాంకేతిక విజ్ఞానం ప్రాముఖ్యతను వివరించారు.ఆధునిక ప్రపంచంలో డిజిటల్ టెక్నాలజీ వేగంగా అభివద్ధి చెందుతోందని, విద్యార్థులు కాలానుగుణంగా తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. క్వాంటమ్ ఇన్నోవేషన్ సెల్ కన్వీనర్ జి. ఫణీంద్ర రెడ్డి మాట్లాడుతూ సాంకేతిక, కృత్రిమమేధ వినియోగంపై విలువైన అవగాహనను పంచుకున్నారు. ప్రాజెక్ట్ ఆలోచన దశ నుంచి తుది రూపకల్పన వరకు ఆటోమేటెడ్ టూల్స్ ఉత్పత్తి ప్రక్రియను ఎలా వేగవంతం చేస్తున్నాయో వివరించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ ఐఐసీ కన్వీనర్ డాక్టర్ వి.శివకష్ణారెడ్డి, క్వాంటమ్ ఇన్నోవేషన్ సెల్ కన్వీనర్ డాక్టర్ జి.ఫణీంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడు దుర్మరణం
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని కదిరి రోడ్డులోని ఎస్సీఎస్‌ఆర్ కల్యాణ మండపం సమీపంలో సోమవారం గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు దుర్మరణం చెందాడు. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని వెలమవారిపల్లె గ్రామానికి చెందిన కృష్ణయ్య కుమారుడు భరత్ (20) ద్విచక్ర వాహనంలో పులివెందులకు వెళ్లి పనులు ముగించుకొని స్వగ్రామానికి బయలుదేరాడు. కదిరి రోడ్డులో వస్తుండగా.. కదిరి నుంచి పులివెందుల వైపు వస్తున్న బొలెరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో భరత్‌కు తీవ్ర గాయాల య్యాయి. యువకుడిని చికిత్స కోసం 108 వాహనంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భరత్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బైక్ డివైడర్‌ను
ఢీకొని ఇంజినీరింగ్ విద్యార్థి..
ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని జమ్మలమడుగు రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో చెప్పలి నాగమల్లేష్ (22) దుర్మరణం చెందాడు. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని శ్రీనివాసనగర్‌కు చెందిన నాగమల్లేష్ బీటెక్ చదివాడు. సోమవారం పరీక్ష రాసి వచ్చిన అతను తన స్నేహితుడు తాళ్లప్రొద్దుటూరుకు చెందిన మహేష్‌ను బస్సు ఎక్కించేందుకు బైక్‌లో బయలుదేరాడు. ఈ క్రమంలో బుడ్డాయపల్లె సమీపంలోకి రాగానే బైక్ డివైడర్‌ను ఢీ కొంది. ఈ ఘటనలో నాగమల్లేష్ అక్కడిక్కడే మృతి చెందగా మహేష్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన అతన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తీసుకెళ్లారు. నాగమల్లేష్ తండ్రి చిన్న వెంకటేష్ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో గుమస్తాగా పని చేస్తున్నాడు. కుమారుడు మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధించసాగారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
పాము కాటుతో రైతు..
లింగాల : లింగాల మండలం పార్నపల్లె గ్రామానికి చెందిన బంగారంపేట ఆదినారాయణ (55) అనే రైతు పాము కాటుకు గురై మృతి చెందాడు. శుక్రవారం ఉదయం రైతు ఆదినారాయణ తన అరటి తోటకు వెళ్లాడు. అక్కడ పాము కాటుకు గురయ్యాడు. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి వేలూరుకు, అనంతరం కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. రైతు ఆదినారాయణకు భార్య గంగమ్మ, పిల్లలు ఉన్నారు.


