పుంగనూరు : ప్రమాదవశాత్తు ఆటో చెట్టును ఢీకొని బోల్తా పడటంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈసంఘటన పట్టణ సమీపంలోని రాంపల్లె వద్ద సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మదనపల్లె పట్టణం ఈశ్వరమ్మ కాలనీకి చెందిన నూర్‌బాషా(42), యాస్మిన్(35), స్థానిక యూబికాంపౌండుకు చెందిన సుమన్‌తాజ్(32)లు కలసి పుంగనూరుకు ఆటోలో వస్తుండగా రాంపల్లె వద్ద ఆటో చెట్టును ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు గాయపడ్డారు. స్థానికులు వీరిని 108లో ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బంగారు, నగదు చోరీ
తంబళ్లపల్లె : ఇంటితలుపులు పగలగొట్టి నగదు, బంగారు చోరీ చేసిన సంఘటన మండలం కేంద్రంలో జరిగింది. బాధితులు జీ.రమణయ్య తెలిపిన వివరాలు.. ఆర్.ఎన్.తాండా పంచాయతీ బోనాసువారిపల్లెకు చెందిన రమణయ్యకు తంబళ్లపల్లె ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా ఇళ్లు ఉంది. శనివారం ఇంటికి తాళం వేసి పనుల నిమిత్తం స్వగ్రామం బోనాసువారిపల్లెకు వెళ్లారు. ఎవరూ లేరని గుర్తించిన గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువా తాళాలు తీసి లోపల లాకర్ పగలగొట్టి 17గ్రాముల బంగారు నగలు, 20 తులాల వెండి గొలుసులు, రూ.20వేల నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితులకు న్యాయం చేయాలి
మదనపల్లె టౌన్ : ప్రజల సమస్యలను విని, వాటికి తక్షణ పరిష్కారం చూపించాలని, బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. సోమవారం మదనపల్లెలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ’ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులతో ఆయన ముఖాముఖిగా మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.
లైంగిక వేధింపులపై
కేసు నమోదు
ఒంటిమిట్ట : మండల కేంద్రమైన ఒంటిమిట్టలో పారిశుధ్య కార్మికురాలైన ఓ మహిళను అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి లైంగిక వేధింపులు చేస్తున్నాడని కేసు నమోదు చేశారు. ఒంటిమిట్ట ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు.. ఏడాది కాలం నుంచి లైంగికంగా, మానసికంగా వేదిస్తున్నాడని బాధితురాలు పిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.


