మదనపల్లె టౌన్ : మదనపల్లెలో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌కు సోమల, గాలివీడు, కేవిపల్లె మండలాల నుంచి వచ్చిన బాధితులు తమ బాధను మీడియాకు తెలిపారు. ఇల్లు కబ్జా చేశారని కూతురు, అల్లునిపై అన్నమయ్య జిల్లా, కేవీపల్లె మండలం, నూతన కాలువకు చెందిన బాధితురాలు కాంతమ్మ జిల్లా ఎస్పీ ధీరజ్ కునిబిల్లికి ఫిర్యాదు చేసింది. కూతురు, అల్లుడు శ్రీనివాసులు, నాగవేణితో ప్రాణహాణి ఉందని, ఇల్లు ఖాళీ చేయించి తనకు న్యాయం చేయాలని వేడుకొంది. అలాగే గాలివీడు మండలం, పందికుంట సుగాలి తాండాకు చెందిన శంకర్ నాయక్ కూలీ పనుల కోసం వేరే ఊరికి వెళ్లి కొన్ని రోజుల తర్వాత వచ్చేసరికి సోదరుడు హుక్కులే నాయక్ తాను ఉంటున్న ఇంటిని ఆక్రమించుకుని ఇప్పుడు తనను ఇంట్లోకి రానివ్వడం లేదని, ఇళ్లు విడించి న్యాయం చేయలనికోరాడు. సోమ మండలం, దొడ్డివారిపల్లెకు చెందిన మోహన, మునిలక్ష్మి 70 ఏళ్లుగా తమ అనుభవంలో ఉన్న ఇంటి స్థలంలో కొత్త ఇంటిని నిర్మిస్తుంటే అదే ఊరికి చెందిన రామకృష్ణ అడ్డుకుని బొలెరోతో గుద్దించి చంపేస్తానని బెదిరిస్తున్నట్లు బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
న్యాయం చేయాలి
కలకడ : నా ఇంటికి ప్రభుత్వం వదలిన దారిని చూపాలని 15నెలలుగా గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులకు విన్నవించినా న్యాయం జరగలేదని బాధితుడు లక్ష్మీపతి ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని ముడియంవారిపల్లె పంచాయతీ బీసీ కాలనీకి చెందిన రామలింగయ్య కుమారుడు లక్ష్మిపతి సోమవారం కలెక్టరేట్ వద్ద మాట్లాడుతూ 2018లో గ్రామంలోని బీసీలకు కేటాయించిన ఇంటి స్థలాలను అదే గ్రామానికి చెందిన కొందరు ఆక్రమించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సర్వే నంబర్:93–2లో ఇంటిపట్టా మంజూరు చేశారని, నా ఇంటికి బీసీ కాలనీ నుంచి 30 లింకుల దారి ఉన్నా దారి వదలడం లేదన్నారు. తన ఇంటికి ఉన్న దారిని అక్రమార్కులు ఆక్రమించారని కలకడ రెవెన్యూశాఖ అధికారులకు విన్నవించినా న్యాయం జరగడంలేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు.


