హత్యకేసులో నిందితులు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

హత్యకేసులో నిందితులు అరెస్టు

May 12 2026 5:42 AM | Updated on May 12 2026 5:42 AM

లక్కిరెడ్డిపల్లి: మండలంలోని పందిళ్లపల్లి గ్రామం, బీసీ కాలనీకి చెందిన చిన్నక్క హత్యకేసులో తల్లీ, కొడుకులైన సావిత్రి, వేణులను సోమవారం అరెస్టు చేసినట్లు రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్‌ పేర్కొన్నారు. పందిళ్లపల్లి కస్సాలోని పసుపులేటి చిన్నక్క (65) ఒకే బజారులో ఉన్న సావిత్రి, వేణులు ఏప్రిల్‌ 25న ఇంటిముందర గొడవపడ్డారు. తల్లీ కొడుకులు చిన్నక్కను గోడకేసి కొట్టడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో ఆమెను లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. చికిత్స చేస్తుండగా ఫిట్స్‌ రావడంతో తిరుపతికి తరలించారు.అక్కడ కూడా పరిస్థితి విషమించడంతో వైద్యులు ఇంటికి తీసుకెళ్లమని చెపారు. దీంతో ఆమెను ఈనెల 7న పందెళ్లపల్లికు తీసుకువచ్చారు.అదేరోజు రాత్రి మృతి చెందింది. సావిత్రి, వేణులు కొట్టిన దెబ్బలకు మా అత్త మృతి చెందిందని చిన్నక్క కోడలు రామాంజనమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు లక్కిరెడ్డిపల్లి సీఐ కృష్ణంరాజు నాయక్‌, ఎస్‌ఐ గోల్కొండ శోభలు కేసు నమోదు చేశారు. సోమవారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు పంపుతున్నట్లు సీఐ, ఎస్‌ఐ తెలిపారు.

అదుపు తప్పి కూలీల ఆటో బోల్తా

వేంపల్లె : వేంపల్లె మండలం నందిపల్లె గ్రామ సమీపంలో వ్యవసాయ కూలీల ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్‌తోపాటు 15మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉదయం వేంపల్లె పట్టణంలోని గౌరీ నగర్‌, సంఘం వీధి, కరణంవీధి తదితర ప్రాంతాల నుంచి నందిపల్లె గ్రామ పొలాల్లోకి వ్యవసాయ కూలీ పనికి ఆటోలో వెళ్లారు. మధ్యాహ్నం పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా ఆటో డ్రైవర్‌ వేరే వాహనాన్ని తప్పించబోయి మట్టి కుప్పను ఎక్కించాడు. అధిక లోడు ఉండడంతో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో 8మందికి తీవ్రంగా, మిగిలిన వారందరికీ స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 108 వాహనంలో వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన డ్రైవర్‌ నిత్యానంద, వీరమ్మ, మహబూబ్‌ బీ, పద్మావతి, అమరావతి, అంజనమ్మ లక్ష్మీదేవిలను మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. మిగిలిన వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement