రుణాల పేరిట మోసం | - | Sakshi
Sakshi News home page

రుణాల పేరిట మోసం

May 12 2026 5:42 AM | Updated on May 12 2026 5:42 AM

సాక్షి, మదనపల్లె : రుణాలు ఇప్పిస్తామని, అందుకు సంఘాలు ఏర్పాటు చేయాలని నమ్మించిన ఇద్దరు మహిళలు అందిన కాడికి దండుకున్నారని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సోమవారం బి.కొత్తకోట పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి కథనం మేరకు వివరాలు. ఫరీదా అనే మహిళ, ఆమె కూతురు నస్రిన్‌ బి.కొత్తకోట పట్టణం, మండలానికి చెందిన మహిళలతో పరిచయాలు పెంచుకున్నారు. వారికి వివిధ పథకాలు మంజూరు చేస్తామంటూ నమ్మించారు. 13 నుంచి 15 మంది మహిళలను కలిపి ఒక సంఘంగా ఏర్పాటు చేసి 38 సంఘాలను ఏర్పరిచారు. వీరికి రూ.ఐదు లక్షల దాకా రుణాలు ఇప్పిస్తామని అందుకు రూ.3 వేల దాకా ఖర్చవుతుందని చెప్పి వసూలు చేశారు. తర్వాత కుట్టు మిషన్లు కూడా ఇప్పిస్తామని నమ్మించి ఒక్కొక్కరి నుంచి రూ.1,200 వసూలు చేశారు. వారిని నమ్మి డబ్బు చెల్లించిన మహిళలకు రుణాలు అందక, కుట్టు మిషన్లు మంజూరు కాకపోవడంతో అనుమానం వచ్చింది. ఈ విషయమై వారిని నిలదీయగా సమాధానం లేదు. తాము చెల్లించిన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరిన ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులు ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. దీనిపై స్టేషన్‌కు వచ్చిన మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు వివరించి న్యాయం చేయాలని కోరారు.

పోలీసులను ఆశ్రయించిన బాధిత మహిళలు

Advertisement
 
Advertisement
Advertisement