పెద్దమండ్యం : మండలంలోని కలిచెర్లకు చెందిన ఓ యువకుడు సౌతాఫ్రికాలో ఆదివారం గుండెపోటుతో మృతిచెందాడు. ఈ మేరకు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. వివరాలలోకి వెళితే.. పెద్దమండ్యం మాజీ ఎంపీపీ పి. ప్రసాద్‌రెడ్డికి ఇద్దరు కుమారులు ఉన్నారు. బీటెక్ పూర్తి చేసిన కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి సౌతాఫ్రికాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో 8 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నా డు. ఇతనికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. అక్కడే కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడి, అలసటగా ఉందని చెప్పి కుప్పకూలినట్లు అతని స్నేహితుల ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, గుండెపోటుకు గురి కావడంతో మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపినట్లు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మాజీ ఎంపీపీ తనయుని ఆకస్మిక మరణంతో కలిచెర్ల, యర్రగుట్టపల్లెలో విషాదం నెలకొంది. భార్య ఇటీవల స్వగ్రామానికి వచ్చి సౌతాఫ్రికాకు వెళ్లి 20 రోజులు అవుతోంది. మృతుని భార్య, బిడ్డను తిరిగి కలిచెర్లకు పంపించేందుకు అక్కడి కంపెనీ ప్రతినిధులు చొరవ తీసుకున్నట్లు సమాచారం. మాజీ ఎంపీపీ తనయుని అకస్మిక మృతిపట్ల తంబళ్లపల్లె ఎమ్యెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, కలిచెర్ల సింగిల్‌విండో మాజీ ఛైర్మన్ కలిచెర్ల సుధాహరరెడ్డి, ఎంపీపీ గుర్రం పూర్ణచంద్రిక, మాజీ ఎంపీపీ టి రెడ్డిశేఖరరెడ్డిలు దిగ్బాంతి వ్యక్తం చేశారు.


