సాక్షి ప్రతినిధి, కడప: జిల్లా అధికార యంత్రాంగం మొద్దునిద్ర పోతోంది. ఏదైనా సంఘటన జరిగేదాకా కళ్లు తెరవనంటోంది. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన కడపలో కార్పొరేషన్ అధికారుల అడ్డగోలు నిర్ణయాలతో ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి పనిచేయాల్సిన వ్యవస్థలు గాడి తప్పుతున్నాయి. అధి కార పక్షం అభిమానం దక్కితే చాలన్నట్లుగా కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితికి చెక్ పెట్టాల్సిన జిల్లా సర్వోన్నతాధికారి చూస్తుండిపోతున్నారు. ఫలితంగా జిల్లా కేంద్రమైన కడపలో ఘర్షణలకు ఆస్కారం ఏర్పడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంకా ఇలాగే వ్యవహరిస్తే సమాజానికి భారీ కీడు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు.
● కూటమి ప్రభుత్వం కొలువుదీరిన క్షణం నుంచి కడప మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం ఇష్టారాజ్యంగా పనిచేస్తోంది. నిబంధనలతో నిమిత్తం లేకుండా అధికారపార్టీని మెప్పిస్తే చాలన్నట్లు వ్యవహరిస్తోంది. అధికారపక్షం ఏం చేసినా వత్తాసుగా నిలవడం మినహా, నిబంధనలకు వ్యతిరేకమని చెప్పే సాహసం కూడా చేయలేని దుస్థితి నెలకొంది.
చలానా స్వీకరణలో నిర్లక్ష్యం...
కార్పొరేషన్ పరిధిలో ప్లెక్సీలను చలానా చెల్లించి ఏర్పా టు చేసుకోవాలి. ఎవరికి నచ్చినట్లు వారు ఇష్టానుసారం ప్లెక్సీలు ఏర్పాటు చేసుకోకూడదని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. 3రోజులకు 10/15 ప్లెక్సీకు రూ.15వందలు చలానా చెల్లించాలి. ఇతరులను రెచ్చగొట్టే ధోరణిలో కాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో కంటెంట్ ఉందా లేదా పరిశీలించి అనుమతించాల్సిన బాధ్యత కూడా కేఎంసీదే. ఇవేవీ గత కొంతకాలంగా కేఎంసీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇలాంటి ధోరణిలోనే తగిన చలానాలు స్వీకరించకుండా.. కంటెంట్‌ను పట్టించుకోకుండా అల్మాస్‌పేట సర్కిల్‌లో ఇబ్బడిముబ్బడిగా ఫ్లెక్సీలకు అవకాశమిచ్చారు. వెరసి రెండు వర్గాలు విడిపోయి ఘర్షణలు దిశగా అడుగులు పడ్డాయని పరిశీలకులు వివరిస్తున్నారు.
ఇన్‌చార్జి కమిషనర్‌పై చర్యలు...
అల్మాస్‌పేటలో శనివారం చోటుచేసుకున్న ఉద్రికత్తలు, ఘర్షణలకు ప్రధాన కారణం ప్లెక్సీలు అనుమతేనని ఓ నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం కడప ఇన్‌చార్జ్ కమిషనర్ రాకేష్‌చంద్రను బదిలీ చేసింది. ఆస్థానంలో రాజంపేట సబ్‌కలెక్టర్ హెచ్‌ఎస్ భావనాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. మున్సిపల్ కార్పొరేషన్ గాడి తప్పుతున్నప్పుడే కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ దృష్టి సారించింటే ఇలాంటి విపత్కర పరిస్థితి చోటుచేసుకునేది కాదని పలువురు వాపోతున్నారు. జిల్లాలో అధికారులు ప్రజాస్వామ్యానికి విఘాతం కల్గిస్తూ, ఏకపక్ష చర్యలకు మొగ్గుచూపుతున్నప్పుడు కలెక్టర్ కర్రపెత్తనం చలాయించాల్సి ఉంది. అలా కాకుండా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనమేంటని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నిబంధనలు అమలు చేయడంలోఅధికారయంత్రాంగం విఫలం
అధికార పక్షానికి చుట్టంగామున్సిపల్ కార్పొరేషన్
అడ్డగోలు వ్యవహారమేఇరువర్గాల ఘర్షణలకు కారణం
కడప కార్పొరేషన్ యంత్రాంగం నిబంధనలు పూర్తిగా గాలికొదిలేశారు. ముందే చేసిన పనులు టెండర్లు పిలిచి కాంట్రాక్టు పనులు అప్పగిస్తున్నారు. లెస్‌కు కోట్ చేసినా పనులు ఇవ్వకపోవడం.. అధికార పార్టీ నేతలు చెప్పిన వారికే టెండర్లు దక్కేలా ప్రణాళిక రచించడం వంటివి చేస్తున్నారు. దీనికి 4వ డివిజన్‌లో చంద్రవర్దిని నగర్ ఆర్చి నుంచి చివర వరకూ రోడ్డు నిర్మాణానికి(టెండర్ ఐడీ 903811) పిలిచిన టెండరే ఉదాహరణ. ఇలా కేఎంసీలో అన్నీ విభాగాల అధికారులు అధికార పక్షం మెప్పుకోసమే తాపత్రయం చూపుతున్నారని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు.
ఇక వైరిపక్షం ఇళ్ల వద్ద, వ్యాపార సంస్థల వద్ద పుట్‌పాత్‌లు తొలగించడం కూడా కేఎంసీ చేస్తూ వచ్చింది. నగరమంతా అవే నిబంధనలు పాటించారా?అంటే అలాంటిదేమి లేదు. అయినవారికి ఆకుల్లో కానీ వారికి కంచాల్లో అన్నట్లుగా కేఎంసీ చర్యలుండిపోయాయి. కేఎంసీ చర్యలే ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.


