కడప సెవెన్‌రోడ్స్: సీమ ఎత్తిపోతల పథకంపై కూటమి సర్కార్ కుట్రలు పన్నుతోందన్న అనుమానం నిజమైంది. ఇరిగేషన్ క్యాలెండర్ సాక్షిగా సీమ ఎత్తిపోతల పథకానికి బాబు సర్కారు నీళ్లొదిలింది. రాయలసీమ వాసులకు మరోసారి మోసం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలెక్టర్ల సమావేశ సందర్భంగా ప్రభుత్వ ఇరిగేషన్ క్యాలెండర్‌ను ప్రకటించారు. రాష్ట్రంలోని 25 సాగునీటి ప్రాజెక్టులను ఎప్పుడెప్పుడు పూర్తి చేస్తారో, ఎప్పుడు శంకుస్థాపనలు చేస్తారో గడువును నిర్ణయిస్తూ రూపొందించిన క్యాలెండర్‌ను ఆయన విడుదల చేశారు. ఇందులో రాయలసీమకు ప్రాణప్రదమైన ఎత్తిపోతల పథకం ఊసే లేదు. రాయలసీమకు తాగు, సాగునీరు అందించే గాలేరు–నగరి, హంద్రీ–నీవా, తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీ, కేసీ కెనాల్, వెలిగొండలతోపాటు చైన్నెకి తాగునీరు అందించడంలో అత్యంత కీలకమైన రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రస్తావన లేకపోవడంపై జిల్లాకు చెందిన పలువురు రైతు నాయకులు, వామపక్షాల నేతలు తప్పుబడుతున్నారు. ‘సీమ’ ప్రాజెక్టుల జీవనాడిగా ఉన్న ఎత్తిపోతల పథకాన్ని ఇరిగేషన్ క్యాలెండర్‌లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత అన్యాయం జరుగుతున్నా అధికార టీడీపీ నేతలు పెదవి విప్పకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎత్తిపోతలు ఎందుకంటే....
శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడు 7 వేల క్యూసెక్కులు మాత్రమే పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు డ్రా చేసుకునేందుకు వీలుంటుంది. శ్రీశైలంలో 880 అడుగుల నీటిమట్టం ఉంటే తప్ప సీమ ప్రాజెక్టులకు అవసరమైన సాగునీరు అందే వీలుండదు. ఇక 841 బెడ్‌లెవెల్‌లో ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఒక్కటే సీమ సాగునీటి అవసరాలు తీర్చలేదు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు ఇక చెప్పాల్సిన పనే ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం ఫోర్ షోర్‌లో 800 అడుగుల నుంచే రోజుకు మూడు టీఎంసీల నీటిని డ్రా చేసుకునేందుకు వీలుగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపట్టారు. సంగమేశ్వరం వద్ద నుంచి నీటిని తీసుకొచ్చి లిఫ్ట్ ద్వారా పోతిరెడ్డిపాడుకు దిగువన నాలుగు కిలోమీటర్ల దూరంలో ఎస్‌ఆర్‌ఎంసీలో కలుపుతారు. ఈ పథకానికి సంబంధించి 2020 మే 5వ తేది ప్రభుత్వం జీఓఆర్‌టీ నెంబరు 203 విడుదల చేసింది. ఈ పథకాన్ని రూ. 3825 కోట్లతో పరిపాలన అనుమతులు ఇచ్చారు. శ్రీశైలం ఫోర్ షోర్ నుంచి నీటిని తీసుకొచ్చే ఇన్‌లెట్ కెనాల్ నిర్మించారు. అలాగే పంపుహౌస్, ఇతర నిర్మాణాలు దాదాపు 80 శాతం జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో పూర్తయ్యాయి. ఈలోపు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాయలసీమకు జీవనాడి అయిన ఈ పథకాన్ని పూర్తిగా నిలిపివేశారు.
‘సీమ’ ద్రోహి చంద్రబాబు
అననుకూల పరిస్థితుల్లో కూడా రాయలసీమ దాహార్తి తీర్చడంలో ఎత్తిపోతల పథ కం జీవనాడిగా ఉంటుంది. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయి. కూటమి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాంతంపై ఆయనకున్న వివక్ష వల్ల ఎత్తిపోతల పథకానికి మరణశాసనం వినిపించారు. దీంతో సీమ ద్రోహిగా నిరూపించుకున్నారు. ప్రభుత్వ ఇరిగేషన్ క్యాలెండర్‌లో సీమ ఎత్తిపోతల పథకానికి చోటు కల్పించకపోవడం ఈ ప్రాంతాన్ని శాశ్వత ఎడారిగా మార్చడమే. – గాలి చంద్ర, సీపీఐ జిల్లా కార్యదర్శి
‘సీమ’ ప్రాజెక్టులకు ప్రాణప్రదం
రాయలసీమ ప్రాజెక్టులకు సాగునీరు అందించడంలో ఎత్తిపోతల పథకం ప్రాణప్రదమైనది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోతిరెడ్డిపాడు ఒక్కటే రాయలసీమ అవసరాలు తీర్చలేదు. శ్రీశైలం ఫోర్‌షోర్‌లో 800 అడుగుల నుంచి నీటిని తీసుకొచ్చే ఈ పథకం ద్వారానే సీమ ప్రాజెక్టులకు నీళ్లందుతాయి. అలాంటి ప్రాజెక్టులు విస్మరించడం తగదు. ఈ విషయంలో అధికార టీడీపీ నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. లేదంటే చరిత్ర క్షమించదు. – సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, అధ్యక్షులు,
రాయలసీమ కార్మిక కర్షక సమితి, కడప


