ఆర్భాటం నమ్మొద్దు.. నాణ్యత మరవొద్దు | - | Sakshi
Sakshi News home page

ఆర్భాటం నమ్మొద్దు.. నాణ్యత మరవొద్దు

May 11 2026 8:02 AM | Updated on May 11 2026 8:02 AM

ప్రవేశాల కోసం ప్రైవేటు విద్యా సంస్థల ప్రచారం

అన్ని అంశాలు తెలుసుకుని విద్యార్థులను చేర్పిస్తేనే మేలు

మదనపల్లె సిటీ : జిల్లాలో విద్యా సంవత్సరం ముగిసింది. మరో విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. పదో తరగతి, ఇంటర్మీడియట్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. విద్యార్థులను చేర్చుకునేందుకు జిల్లాలోని ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాల వారు ప్రచారం ముమ్మరం చేశారు. విద్యార్థులను ఆకర్షించేందుకు కొన్ని ప్రైవేట్‌ యాజమాన్యాలు పిల్లలు,వారి తల్లిదండ్రులను ప్రలోభపెట్టేలా ప్రచారం నిర్వహించే అవకాశముంది. ఈ నేపథ్యంలో వారి మాయమాటలు, ప్రచార ఆర్భాటాన్ని నమ్మకూడదని, విద్యార్థులకు నాణ్యమైన బోధన, మెరుగైన వసతులు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో చేర్పించాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు.

అనుమతులు

పాఠశాలలు, కళాశాలల్లో చేర్పించే ముందు ఆయా విద్యా సంస్థలకు విద్యాశాఖ, ఇంటర్‌ బోర్డు నుంచి అన్ని రకాల అనుమతులు ఉన్నాయా? లేవా? అని తెలుసుకోవాలి. అగ్నిమాపకశాఖ అనుమతులు, పిల్లల రక్షణకు తీసుకుంటున్న భద్రతా ప్రమాణాలను పరిశీలించడం తప్పనిసరి. ఈ విషయాలు తెలుసుకునేందుకు విద్యాశాఖ, ఇంటర్‌ బోర్డు అధికారులను సంప్రదించాలి.

ఫలితాల సరళి

కొన్ని పాఠశాలలు, కళాశాలల్లో మెరుగైన ఫలితాలు రాకున్నా.. యాజమాన్యాలు ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాఽధించినట్లు తప్పుడు ప్రచారం చేస్తూ పిల్లల తల్లిదండ్రులను గందరగోళానికి గురి చేస్తాయి. ఆ విద్యా సంస్థల గత ఫలితాల సరళిని పరిశీలించాలి. ఆ పాఠశాలలు, కళాశాలలో విద్యతో పాటు ఏయే అంశాల్లో విద్యార్థులు రాణించేలా దృష్టి పెడుతున్నాయో పరిశీలించాలి.

బోధన అర్హత

ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల్లో బోధించే ఉపాధ్యాయులు, అధ్యాపకుల అర్హత గురించి తెలుసుకోవాలి. ప్రధానంగా పాఠశాలల్లో బీఈడీ, డీఈడీ చదినవారు బోధిస్తున్నారా, అనర్హులతో బోధిస్తున్నారా? అన్న వివరాలను ఆరా తీయాలి. పలు పాఠశాలలు తక్కువ వేతనాలు ఇవాల్నన్న ఉద్దేశంతో ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేయని వారితో బోధిస్తుంటాయి. అర్హులైన ఉపాధ్యాయులతో బోధించే పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలి.

ఇరుకు గదులపై ఆరా

జిల్లాలోని చాలా ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో శిథిలావస్థకు చేరిన భవనాలు, ఇరుకిరుకు గదుల్లో బోధిస్తున్నారు. గాలి,వెలుతురు రాని గదుల్లో బోధిస్తుంటే విద్యార్థులు అసౌకర్యానికి గురవుతుంటారు. బోధకుల చెప్పే అంశాలు విద్యార్థుల చెవికెక్కవు. విశాలమైన గాలి, వెలుతురు ఉన్న గదుల్లో బోదించే బడుల్లో చేర్పించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.

మైదానం ఉందా?

విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు కూడా ఎంతో ముఖ్యం. నిర్ణీత వేళల్లో పిల్లలను తప్పకుండా క్రీడలు ఆడించాలి. జిల్లాలో చాలా ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల్లో అసలు మైదానాలే లేవు. వ్యాయామ ఉపాధ్యాయులను నియమించరు. మైదానాలు, వ్యాయామ ఉపాధ్యాయులు ఉండి,ఆటలు ఆడించే విద్యా సంస్థలను ఎంచుకోవాలి. సంగీతం, పాటలు, భరతనాట్యం, కూచిపూడి నృత్యం తదితరాలు నేర్పిస్తూ పిల్లలకు సాంస్కృతిక అంశాలపై ఆసక్తి పెంపొందించే విద్యా సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

సౌకర్యాలు ఉన్న పాఠశాల్లో చేర్పించాలి

ప్రభుత్వ అనుమతి పొంది, అన్ని సౌకర్యాలు ఉన్న పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి. ఒకసారి పాఠశాల,కళాశాలను పరిశీలించాలి. ఎవరో చెప్పిన మాటలు విని మోసపోకూడదు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాల, కాలేజీలను ఎంపిక చేసుకోవాలి.

–జీవీ ప్రసాద్‌, విద్యావేత్త, మదనపల్లె

Advertisement
 
Advertisement
Advertisement