ఆధునిక ప్రపంచ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి | - | Sakshi
Sakshi News home page

ఆధునిక ప్రపంచ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి

May 11 2026 8:02 AM | Updated on May 11 2026 8:02 AM

కురబలకోట : జిడ్డు కృష్ణమూర్తి..ఈపేరు ఇప్పటి తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు..అదే పెద్దతరం వారు వింటే పులకరించిపోతారు. ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచారు. కాలానికి పరిమితమైన వారు కాదు..తరతరాలకు గుర్తుండిపోయే మానవతావాది. గొప్ప దార్శనికుడిగా,రచయితగా అంతకు మించి విద్యావేత్తగా,ధార్మికుడిగా, తత్వవేత్తగా ఆయన ఫిలాసిపీ ఎందరినో కదిలించింది. జాతి, మత, దేశ,రాజకీయ ఆదర్శాలకు అతీతంగా విద్యార్థులకు విద్య నందించడమే నూతన ప్రపంచానికి మార్గమన్నారు. సత్యాన్వేషణతోనే జ్ఞానోదయం అని చాటి చెప్పిన ప్రపంచ తత్వవేత్తగా ఖ్యాతి గడించాడు. ఆయన జీవిత విశేశేషాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. మదనపల్లెలో పుట్టి మద్రాస్‌ అడయార్‌లో పెరిగి ఆపై ప్రపంచ మాస్టర్‌గా ఎదిగిన ఆయన 60 ఏళ్లకు పైగా ప్రపంచ దేశాలు పర్యటించారు. జీవన సందేశాన్ని వినిపించారు. విప్లవాత్మకమైన జీవన తాత్వికతను ప్రపంచానికి అందించాడు. ప్రదానంగా సత్యాన్ని తెలుసుకోడానికి దారులు లేవు. ఎవరికి వారు అన్వేషించి తెలుసుకోవాలన్నారు. ఎవరినో ఆదర్శంగా తీసుకోవడం కన్నా నిన్ను నీవు తెలుసుకోవడం వల్ల సత్యాన్ని తెలుసుకోగలరన్నారు. సాంప్రదాయ విద్య కన్నా స్వతంత్రాలోచన కల్గించే విద్య మనిషిని మేల్కొలుపుతుందన్నారు. సిద్దాంతాలకు కట్టుబడి ఉండరాదన్నారు. మనిషిని పరిపూర్ణుడిగా చేయడమే విద్య కర్తవ్యమని బోధించారు. విద్యార్థి నిరంతరం నేర్చుకునే వాడిగా ఉండాలి..టీచర్‌ విద్యార్థి లోని సృజనాత్మకతను తట్టి మేల్కొపేలా ఉండాలి. మనసు నిండా ప్రేమ ఉన్న వారు మంచి తప్ప చెడు చేయలేరని చెప్పారు. మనిషి సంపూర్డుడిగా ఎదగాలని పదేపదే చెప్పారు. పదవులను ఆయన తృణప్రాయంగా ఎంచారు. ఇప్పటితరం వారు చిన్న పదవులు లభిస్తే వదలమన్నా వదలరు. అనిబిసెంట్‌ అప్పట్లో ఆయన్ను ప్రపంచానికి జగద్దురువును చేయాలని ఆర్డర్‌ ఆఫ్‌ది స్టార్‌ అనే సంస్థకు అధినేతను చేశారు. అది నచ్చక 1926లో రద్దు చేయడంతో పాటు ఏకంగా దాని నుంచి వైదొలిగారు. వందల కోట్ల ఆస్తిని కూడా వదులుకున్నారు. ఈ ఆకస్మిక నిర్ణయంపై అప్పట్లో యావత్‌ ప్రపంచమే విస్తుపోయింది. ఇది అపూర్వ ఘట్టంగా చరిత్రలో నిలచిపోయింది.మానసిక విప్లవం, మనోభావ విచారణపై ఎన్నో ప్రసంగాలు చేశారు. ఎవరికి వారు మార్పు చెందాలన్నారు. మానసిక విప్లవం, మనోభావ విచారణపై ఎన్నో ప్రసంగాలు చేశాడు. మూడ నమ్మకాల నుంచి విముక్తి పొందాలనేవారు. జిడ్డు కృష్ణమూర్తికి చదువు సంధ్యల పట్ల పెద్దగా ఆసక్తిలేకపోయినా 15 ఏళ్లవయస్సులో అట్‌ ది ఫీట్‌ ఆఫ్‌ది మాస్టర్‌ అనే పుస్తకాన్ని ఆంగ్లంలో రాశారు. మదనపల్లె పట్టణంలో 1895 మే 11న తల్లితండ్రులు సంజీవమ్మ, నారాయణయ్యకు ఎనిమిదో సంతానంగా జన్మించి ఆయన 1986 ఫిబ్రవరి 17న శాశ్వత నిద్రలోకి వెళ్లారు. కృష్ణమూర్తి ఫౌండేషన్‌ పేరిట దేశ విదేశాల్లో విద్యాలయాలు నడుస్తున్నాయి. వీటన్నింటి కన్నా దేశంలోని మదనపల్లె దగ్గరున్న రిషివ్యాలీ స్కూల్‌ ప్రత్యేకతను సంతరించుకుంది. 1925లో సోదరుడు నిత్యానంద ఆకస్మిక మరణం ఆయనలో ఎనలేని మార్పునకు దారితీసింది. జిడ్డు కృష్ణమూర్తి బోధనలు సామాజిక అవసరాలను గుర్తించి మనిషిలో జ్ఞాన తృష్ణను రగిలిస్తాయి.ఆయన మన తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణం.ఆధునిక తత్వవేత్తలలో ఆద్యుడిగా, ప్రపంచ జ్ఞానిగా పేరు గడించాడు. ప్రపంచానికి భారత దేశం అందించిన గొప్ప మహోన్నతుడిగా, విశ్వ మానవుడిగా జిడ్డు కృష్ణమూర్తి గురించి యావత్‌ ప్రపంచం కొనియాడుతోంది.

నేడు జయంతి

Advertisement
 
Advertisement
Advertisement