పెద్దతిప్పసముద్రం : మండలంలోని రాపూరివాండ్లపల్లి పంచాయతీ ఉప్పరవాండ్లపల్లిలో మావిళ్ల చెన్నకృష్ణ అనే వ్యక్తి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. చెన్నకృష్ణ సోదరుడు లక్ష్మినారాయణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా.. చెన్నకృష్ణ బెంగళూరులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ 15 రోజులకోసారి కుటుంబ సభ్యులతో కలసి స్వగ్రామానికి వచ్చి వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 7న ఆయన ఎప్పటి లాగానే భార్యా, పిల్లలను వెంట బెట్టుకుని ఉద్యోగరీత్యా తిరిగి బెంగళూరుకు వెళ్లిపోయాడు. ఈ తరుణంలో ఈ నెల 8న గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న రూ.2.50 లక్షల నగదు, సుమారు 200ల గ్రాముల బంగారంతో పాటు వెండి నగలు అపహరించుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. విషయం తెలుసుకున్న ములకలచెరువు సీఐ దస్తగిరి, ఎస్‌ఐ పరమేశ్ నాయక్‌లు సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చోరీకి పాల్పడింది స్థానికులా, బయట వ్యక్తులా, అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
రైలు కింద పడి వ్యక్తి మృతి
పీలేరు రూరల్ : రైలు కింద పడి గుర్తతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన స్థానిక చిత్తూరు రోడ్డు మార్గంలోని రాజీవ్‌నగర్ కాలనీ సమీపంలో జరిగింది. వివరాలిలావున్నాయి. ఆదివారం మధ్యాహ్నం ముంబై నుంచి నాగర్‌కోయిల్ వెళుతున్న రైలు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు గుర్తించి రైల్వేపోలీసుల కు సమాచారం ఇచ్చారు. మృతుని వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉంటుంది. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు.
యువకుడు ఆత్మహత్యాయత్నం
మదనపల్లె టౌన్ : ఒంటికి నిప్పు అంటించుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన ఆదివారం బి.కొత్తకోట మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుడి కుటుంబీకుల కథనం మేరకు వివరాలు.. బి. కొత్తకోటకు చెందిన వై. వెంకటరమణారెడ్డి కొడుకు మహేందర్ రెడ్డి (30) కొంతకాలం క్రితం ఇంట్లో నుంచి ఎక్కడికో వెళ్లిపోయాడు. రెండేళ్ల తర్వాత ఇంటికి రావడంతో కుటుంబీకులు మహేందర్‌రెడ్డి తీరు మార్చుకొని బుద్ధిగా ఇంటివద్దే ఉండాలని మందలించారు. దీంతో అతను తీవ్ర మనస్థాపం చెంది, ఇంట్లో ఉన్న పెట్రోల్ ఒంటిపై పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. కుటుంబీకులు గమనించి బాధితుడుని చికిత్స కోసం మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. దీంతో మహేందర్ రెడ్డిని ఓ ప్రైవేట్ వాహనంలో తిరుపతి రుయాకు తరలించారు.
13న రాష్ట్రస్థాయి
బండలాగుడు పోటీలు
కాశినాయన : మండలంలోని ఆనంవారిపల్లె గ్రామంలో సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఈనెల 13న రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలను నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. మొదటి బహుమతి హోండా యూనికాన్ బైక్, రెండో బహుమతి హోండా షైన్, మూడో బహుమతిగా రూ.80వేలు గెలుపొందిన ఎడ్ల యజమానులకు అందిస్తామని వారు వివరించారు. పోటీల్లో పాల్గొనదలచిన రై తులు 13న మధ్యాహ్నం తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 9441337657 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.


