బద్వేలు అర్బన్ : ఈత నేర్చుకునేందుకు స్విమ్మింగ్‌పూల్‌కు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి ఓ బాలుడు మృతిచెందిన ఘటన ఆదివారం బద్వేలు పట్టణంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే పోరుమామిళ్ల మండలం దమ్మనపల్లె గ్రామానికి చెందిన దాసరినారాయణ, రమాదేవి దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. వ్యాపార నిమిత్తం గత కొన్నేళ్లుగా వీరు పట్టణంలోని మార్తోమానగర్‌లో నివసిస్తున్నారు. వీరి కుమారుడైన దాసరిఅర్జున్ (10) పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 5వ తరగతి పూర్తి చేశాడు. ఈత నేర్చుకునేందుకు ఆదివారం మధ్యాహ్నం పోరుమామిళ్ల బైపాస్‌రోడ్డులోని స్విమ్మింగ్‌పూల్‌కు అర్జున్ తన సోదరితో పాటు మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. నడుముకు ట్యూబ్ వేసుకుని నీటిలోకి దిగిన అర్జున్ కొద్దిసేపటికి ట్యూబ్ తీసేశాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వారించి మళ్లీ ట్యూబ్ వేసుకుని స్విమ్మింగ్‌పూల్‌లోకి దిగమని సూచించారు. అయితే కొద్దిసేపటికి మళ్లీ ట్యూబ్ తీసేసిన అర్జున్ లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోకి దిగడంతో నీటిలో మునిగిపోయాడు. కొద్దిసేపటికి గుర్తించిన కుటుంబ సభ్యులు అర్జున్‌ను స్విమ్మింగ్‌పూల్ నుంచి బయటికి తీసుకువచ్చి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సరదాగా ఈతకు వెళ్ళి ఉన్న ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని తల్లిదండ్రులు దమ్మనపల్లె గ్రామానికి తీసుకెళ్లారు. ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.
స్విమ్మింగ్‌పూల్‌లో పడి బాలుడు మృతి


