వాల్మీకిపురం : పాము కాటుతో ఓ మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని ఫత్తేపురంలో ఆదివారం చోటు చేసుకొంది. వివరాలు.. వాల్మీకిపురం పంచాయతీ ఫత్తేపురానికి చెందిన అంజి భార్య యమున (38) ఆదివారం ఉదయం ఇంటి ముందు చెత్త ఊడుస్తుండగా పాము కాటేసింది. గమనించిన కుటుంబ సభ్యులు 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు.అక్కడ నుంచి మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు తిరుపతి రుయాకు తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. యమున భర్త అంజి గతంలో మృతి చెందగా.. ఇద్దరి పిల్లల ఆలనాపాలనా చూసుకుంటుండగా యమున మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పాము కాటేసి వ్యక్తికి అస్వస్థత
మదనపల్లె టౌన్ : పొలంలో దోస కాయలు కోస్తుండగా విష సర్పం కాటేసి కూలి పనులకు వచ్చిన సత్యసాయి జిల్లా వాసి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆదివారం జిల్లాలో చోటుచేసుకున్న ఘటనపై వివరాలు.. సత్యసాయి జిల్లా, తనకల్లు మండలం, కొక్కంటి క్రాస్ లో నివాసం ఉంటున్న గోపాల్ కుమారుడు రవి (48) ఈ ప్రాంతానికి చెందిన ఓ రైతు సాగుచేసిన దోసకాయ పంటను వడపడానికి ఓ టెంపోలో కూలీలను తీసుకొని చిత్తూరు జిల్లా, చౌడేపల్లి సమీపంలోని బోయకొండకు ఆదివారం ఉదయం వచ్చాడు. కూలీలతో దోస కాయలు కోయిస్తుండగా చెట్ల మధ్యన ఉన్న విష సర్పం రవి కాలిపై కాటేసింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితుడిని సహచరులు వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్యం అందించారు. దీంతో రవి ప్రాణాపాయం తప్పి కోలు కుంటూ ఉన్నాడు.


