కోట అందం.. చూసొద్దాం | - | Sakshi
Sakshi News home page

కోట అందం.. చూసొద్దాం

May 10 2026 7:52 AM | Updated on May 10 2026 7:52 AM

రాజరికానికి దర్పణం గుర్రంకొండ కోట

అన్నమయ్య జిల్లాకు మణిహారం

నిత్యం పర్యాటకుల సందడి

గుర్రంకొండ : వేసవి సెలవుల్లో పిల్లలు, పెద్దలు చూడదగిన ప్రదేశం చారిత్రాత్మాక గుర్రంకొండ కోట. అన్నమయ్య జిల్లాలో రాచరికానికి, నవాబులు, రాజులు, బ్రిటీషు వారి పాలనకు నిలువుటద్దం ఈ కోట. జిల్లాకు నడిబొడ్డున ఒక మణిహారంలా, పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. 14 వ శతాబ్దం నుంచి ఈ కోటను పలు వంశాలకు చెందిన రాజులు, నవాబులు పరిపాలించారు. ముఖ్యంగా కడప నవాబు పరిపాలనలో ఇది పేరుగాంచింది. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి దేవాలయాలు, ఎన్నో చెరువులు ఉన్నాయి. మైసూర్‌ రాజు టిప్పు సూల్తాన్‌ బాల్యం, విద్యాభాస్యం ఇక్కడే గడిచింది. చివరగా బ్రిటీషు వారితో ఇక్కడ రాజరిక పాలనకు తెరపడింది. ఘన చరిత్ర కలిగిన ఈ కోటలో ఎన్నో విశేషాలు, చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి. వేసవి సెలవుల్లో ఇక్కడి విశేషాలను తిలకించడానికి మన రాష్ట్రం నుంచే కాక కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. మనం కూడా ఒకసారి చూసొద్దాం రండీ.

రంగిణీ మహల్‌

గుర్రంకొంట కోటలో చూడదగిన ముఖ్య ప్రదేశం రంగిణీమహల్‌. పురాతన రాజభవనం. ముందువైపు నుంచి రెండు అంతస్తులుగానూ, వెనకవైపు నుంచి మూడు అంతస్తులు నూ కనిపించడం దీని ప్రత్యేకత. ఎన్నో గదులు, ఓ గదిలో భవనం లోపలి నుంచి సొరంగ మార్గం ఉంది. శత్రురాజులు దండెత్తినప్పుడు ఈ మార్గం గుండా కోట బయటికి వెళ్లేందుకు ఆస్కారం ఉండేది. పురాతన మెట్లు, సమావేశపు గదులు రాజరికానికి నిలుటద్దంగా నిలుస్తాయి.

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం

గుర్రంకొండ కోటను విజయనగర రాజులు పాలించే కాలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని.. అప్పటి పాలకులు శ్రీకృష్ణ దేవరాయులు కోటలోని కొండపైభాగంలో నిర్మించినట్లుగా చరిత్ర చెబుతోంది. శిల్పకళాసౌందర్యంతో ఈ దేవాలయ స్తంభాలు ఇట్టే ఆకట్టుకొంటాయి. అన్ని దేవాలయాలు తూర్పుముఖంగా నిర్మిస్తే.. దీన్ని పశ్చిమముఖంగా నిర్మించడం విశేషం. ఇక్కడి నుంచి చూస్తే గుర్రంకొండ పట్టణంతోపాటు పరిసర గ్రామాల పచ్చటి పొలాలు, రాయల కాలం నాటి చెరువులు కనిపిస్తాయి.

కోట ముఖద్వారం

గుర్రంకొండను రాజులు పరిపాలించే కాలంలో కొండ చుట్టూ కోటగోడలను నిర్మించారు. కోటగోడల చుట్టూ కందకాలు తవ్వారు. ఈ కందకాల్లో నీటిని నింపేవారు. శత్రువులు కోటగోడలు ఎక్కకుండా ఆ నీటిలో మొసళ్లను వదిలేవారు. అలాంటి కోటకు ముఖద్వారాన్ని నిర్మించారు. ఈ ద్వారం నుంచే ఎవరైనా కోటలోకి ప్రవేశించే వారు. పురాతన కట్టడంగా ఇది నిలుస్తోంది.

మగ్బీరా

కోట పక్కనే మగ్బీరా ఉంది. పురాతన మహమ్మదీయుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కట్టడం ఇది. మగ్బీరా అంటే సమాధి. గుర్రంకొండ కోటను టిప్పుసుల్తాన్‌ మేనమామ మీర్‌రజాఆలీఖాన్‌ పాలించే వారు. అతను మృతి చెందిన తరువాత సమాధిని మగ్బీరాగా నిర్మించారు. డూమ్‌లో చేసే శబ్దాలు ప్రతి ధ్వనించడం(రీసౌండ్‌) ఇక్కడి ప్రత్యేకత.

షాహజాదీ మసీదు

టిప్పు సుల్తాన్‌ కాలంలో రాజవంశీయుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన మసీదు ఇది. పూర్తిగా రాతితోనే నిర్మించారు. ప్రస్తుతం దీన్ని పూర్తి స్థాయిలో ఆధునికరించారు. ఇలాంటివి కోట పరిసరాల్లో మరో రెండు ఉన్నాయి.

షాకమాల్‌ దర్గా

మైసూర్‌ పాలకులు, అప్పటి గుర్రంకొండ కోట పాలకులు అయిన టిప్పు సుల్తాన్‌ ఆస్థాన గురువు షాకమాల్‌ దువ్వమ్‌. ఆయన ఈజిప్టు దేశం నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడినట్లు చరిత్ర చెబుతోంది. ఆయన గొప్పతనం విన్న అప్పటి మైసూర్‌ పాలకులు హైదరాలీ తన కుమారుడు టిప్పుసుల్తాన్‌ను గుర్రంకొండలోని అతని మేనమామ మీర్‌రజా ఆలీఖాన్‌ వద్ద ఉంచి షాకమాల్‌ దగ్గర విద్యాబుద్ధులు నేర్పించారు. తదనంతర కాలంలో షాకమాల్‌ దువ్వమ్‌ టిప్పుసుల్తాన్‌ గురువుగా నియమింపబడ్డాడు. ఇతని సమాధినే ఇక్కడ గొప్ప దర్గాగా ప్రజలు కొలుస్తారు.

ఇంకా చూడదగిన విశేషాలు

● కొండపైన కోట బురుజులు, పురాతన కట్టడాలు, పురాతన ఇళ్లు ఉన్నాయి. అక్కడికి చేరుకోవడానికి మెట్లమార్గం కూడా ఉంది.

● కోటలో శిథిలావస్థకు చేరుకొన్న అలనాటి ఆస్పత్రి భవనం ఉంది.

● శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ విఘ్నేశ్వరస్వామి ఆలయాలు, టిప్పుసుల్తాన్‌ కాలం నాటి ఈద్గాలు ఉన్నాయి.

● గుర్రంకొండ పట్టణంలో శ్రీ షాకమాల్‌ దర్గా దగ్గర టిప్పుసుల్తాన్‌ చదువుకొన్న పాఠశాల యూసూఫ్‌ సాహేబ్‌ తకియా ఉంది.

ముందువైపు నుంచి రెండు అంతస్తులుగా

కనిపిస్తున్న రంగిణీమహల్‌

వెనుకవైపు నుంచి మూడు అంతస్తులుగా

కనిపిస్తున్న రంగిణీ మహల్‌

Advertisement
 
Advertisement
Advertisement