అదనపు రైల్వేబోర్డు సభ్యుడిగా కె.వి.రెడ్డి | - | Sakshi
Sakshi News home page

అదనపు రైల్వేబోర్డు సభ్యుడిగా కె.వి.రెడ్డి

May 10 2026 7:52 AM | Updated on May 10 2026 7:52 AM

పీలేరు రూరల్‌ : భారతీయ రైల్వే బోర్డులో అత్యుతన్నత గ్రేడ్‌ 16 అదనపు రైల్వే బోర్డు సభ్యుడిగా పీలేరు ప్రాంతానికి చెందిన కె.వి.రెడ్డి (కె.వెంకటరమణారెడ్డి)కి పదోన్నతి లభించింది. కె.వి.రెడ్డి గుంతకల్లు డీఆర్‌ఎంగా, దక్షిణ మధ్య రైల్వేలో పీసీఎస్‌వోగా, ఐఆర్‌ఐఎస్‌ఈటీలో ప్రొఫెసర్‌గా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. పీలేరు రైల్వే స్టేషన్‌ను అమృత్‌ రైల్వే స్టేషన్‌గా అభివృద్ధి చేయడంలో, అనేక ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పీలేరులో స్టాపేజీలకు విశేష కృషి చేశారు. ఆయన 1990 ఐఈఎస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారి.

11న కలెక్టరేట్‌ ముట్టడి

మదనపల్లె సిటీ : సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 11వ తేదీన జిల్లా కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంటీఎస్‌ ఉపాధ్యాయ సంఘ నాయకులు కృష్ణారెడ్డి, వివ్వనాథరెడ్డి, ఆదినారాయణ తెలిపారు. 25 ఏళ్లుగా సర్వీసు నష్టపోయిన తమను వెంటనే రెగ్యులర్‌ చేయాలని, ఉద్యోగ కాలపరిమితి 62 ఏళ్లకు పెంచాలని, 12 నెలల కాలానికి వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రిటైర్డ్‌ అయిన వారికి నెలకు రూ.25 వేలు పెన్షన్‌ ఇవ్వాలని, హెల్త్‌కార్డులు జారీ చేయాలన్నారు. దూర ప్రాంతాలకు బదిలీ అయిన వారిని సొంత మండలాలు, దగ్గర ప్రాంతాలకు బదిలీ చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు అక్కులప్ప, రవి, జమాల్‌భాషా, వాసుదేవ తదితరులు పాల్గొన్నారు.

పిడుగుపాటుతో ఆవు మృతి

కలికిరి : పిడుగుపాటుతో పాడి ఆవు మృతి చెందిన ఘటన మండలంలోని పల్లవోలు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. పల్లవోలు గ్రామం లింగపల్లికి చెందిన ప్రభాకర పాడి ఆవులను మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం పొలం వద్ద ఆవులను మేపుకొంటుండగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వచ్చింది. ఆవులకు సమీపంలో పిడుగు పడటంతో సుమారు రూ.లక్ష విలువ చేసే పాడి ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. పాడి ఆవుల పాల దిగుబడితో జీవనం సాగిస్తున్న పాడి రైతు ఆవు మృతి చెందడంతో ఆవేదన వ్యక్తం చేశాడు. బాధిత రైతును ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

యువకుడు ఆత్మహత్యాయత్నం

మదనపల్లె టౌన్‌ : ఎలుకల నివారణ మందు తాగి ఓ ప్రైవేటు వాహన డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శనివారం చౌడేపల్లి మండలంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మండలంలోని ఆమనకుంటకు చెందిన సుబ్రహ్మణ్యం కుమారుడు చందు(27) ప్రైవేట్‌ వాహనాలకు డ్రైవర్‌గా పని చేస్తూ, తల్లిదండ్రులతోపాటు భార్య శిల్పా, తన ముగ్గురు పిల్లలను పోషించుకుంటూ ఉన్నాడు. ఈ క్రమంలో కుటుంబ సమస్యల కారణంగా మనస్తాపం చెంది ఇంట్లో ఉన్న ఎలుకల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబీకులు బాధితుడిని వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అక్కడి వైద్యులు తిరుపతి రుయాకు రెఫర్‌ చేశారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

అనంతపురం సెంట్రల్‌ : అనంతపురం నగరంలో చోటు చేసుకున్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకులు చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు తెలిపిన మేరకు... వైఎస్సార్‌ జిల్లా కడప నగరం ఆజాద్‌నగర్‌కు చెందిన షేక్‌ కరీముల్లా కుమారుడు షేక్‌ మహబూబ్‌బాషా(20), అనంతపురంలోని రాణినగర్‌కు చెందిన బాబావలి కుమారుడు ఖాసీంవలీ(18) బంధువులు. రెండు రోజుల క్రితం మహబూబ్‌ బాషా అనంతపురానికి వచ్చాడు. శుక్రవారం ఖాసీంవలీతో కలిసి విద్యుత్‌నగర్‌ సర్కిల్‌ నుంచి సంఘమేష్‌ సర్కిల్‌ వైపుగా ద్విచక్ర వాహనంపై వెళుతూ.. రమణ రమేష్‌ థియేటర్‌ సమీపంలోకి చేరుకోగానే నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొన్నారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకులను స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇద్దరూ చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement