ఘాట్‌ రోడ్డుపై ఆటో బోల్తా | - | Sakshi
Sakshi News home page

ఘాట్‌ రోడ్డుపై ఆటో బోల్తా

May 10 2026 7:52 AM | Updated on May 10 2026 7:52 AM

సాక్షి, మదనపల్లె : పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌ ఘాట్‌రోడ్డుపై శనివారం మధ్యాహ్నం ఓ ఆటో ప్రమాదానికి గురైంది. ఆటో ప్రొద్దుటూరు మలుపు వద్ద బోల్తా పడింది. అందులోని వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆటో ధ్వంసం అయింది. ఈ పర్యాటకులు ఎక్కడి వారు, ఎంత మంది ఉన్నారు అన్న వివరాలు తెలియరాలేదు. ప్రమాదం జరిగిన సమయంలో కొండపై నుంచి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి కిందికి వస్తున్నారు. ప్రమాదం చూసి అక్కడ ఆగిన ఆయన బాధితులకు సహకారం అందించారు. భద్రత సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. తర్వాత ఆటోను ప్రమాద ఘటన నుంచి తీసుకువెళ్లిపోయారు. అయితే ఆటోకు సంబంధించి వివరాలు ఏవీ తెలియ రాలేదు. ఈ మలుపు వద్ద ఇటీవల ప్రమాదాలు అధికమవుతున్నాయి. ఇది మూడో ప్రమాదం.

పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

మదనపల్లె టౌన్‌ : పెద్దల నుంచి రక్షణ కల్పించాలని ఓ ప్రేమ జంట శనివారం మదనపల్లె డీఎస్పీ పావనిని కలిసి ఫిర్యాదు చేసింది. వారి ఫిర్యాదు మేరకు.. సదుం మండలంతాటిగుంట పాళ్యంకు చెందిన రమణయ్య, చంద్రమ్మ దంపతుల కుమారుడు నాగార్జున మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా తిరుపతిలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో మొలకలచెరువు మండలం రెడ్డివారిపల్లెకు చెందిన సుధాకర్‌, మంజుల దంపతుల కుమార్తె కుంచపు హర్షిత బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతూ నాలుగేళ్లుగా ప్రేమించు కుంటున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో విడదీస్తారనే భయంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి శుక్రవారం పీలేరులోని ఒక గుడిలో వివాహం చేసుకున్నారు. అనంతరం తమకు పెద్దల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ శనివారం మదనపల్లె డీఎస్పీ కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు డీఎస్పీ సదుం పోలీసులతో మాట్లాడి మేజర్‌లైన ఈ జంటకు రక్షణ కల్పించాలని, ఇరువురి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇవ్వాలని ఆదేశించారు.

డయాలసిస్‌ కేంద్రం మంజూరు

పీలేరు : పీలేరు ఏరియా ఆస్పత్రికి డయాలసిస్‌ కేంద్రం మంజూరైనట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చంద్రశేఖ్‌ తెలిపారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా 12 డయాలసిస్‌ కేంద్రాలు మంజూరు కాగా అందులో పీలేరుకు డయాలసిస్‌ కేంద్రం మంజూరైనట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా, స్థానికంగా డయాలసిస్‌ కేంద్రం అందుబాటులో రానున్నట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement