ఒమన్‌లో చిక్కుకున్న మహిళ సురక్షితంగా ఇంటికి.. | - | Sakshi
Sakshi News home page

ఒమన్‌లో చిక్కుకున్న మహిళ సురక్షితంగా ఇంటికి..

May 10 2026 7:52 AM | Updated on May 10 2026 7:52 AM

మదనపల్లె టౌన్‌ : ఉపాధి కోసం గల్ఫ్‌ దేశం వెళ్లి అక్కడ యజమానుల చేతిలో మోసపోయి, నరకయాతన అనుభవించిన అన్నమయ్య జిల్లా వాయల్పాడుకు చెందిన మహిళ షహానాజ్‌ ఎట్టకేలకు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. ఈ వివరాలను శనివారం మదనపల్లిలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ (పరిపాలన) వెల్లడించారు. వాయల్పాడుకు చెందిన షహానాజ్‌, అబూబకర్‌ దంపతులకు ముగ్గురు చిన్న పిల్లలు. కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏజెంట్ల ద్వారా ఉపాధి కోసం షహానాజ్‌ ఒమన్‌ లోని మస్కట్‌కు వెళ్లారు. అక్కడ మొదటి నాలుగు నెలలు బాగానే ఉన్నప్పటికీ, గత రెండు నెలలుగా యజమానులు ఆమెతో అధికంగా పని చేయిస్తూ, కనీసం భోజనం కూడా పెట్టకుండా వేధించారు. అనారోగ్యంతో ఉన్న ఆమెను చీకటి గదిలో బంధించి, బయటికి వెళ్లనివ్వకుండా చిత్రహింసలు పెట్టారు. దీంతో ఆమె వాట్సాప్‌ వీడియో కాల్‌ ద్వారా కుటుంబ సభ్యులకు తన దీనస్థితిని తెలుపుతూ రోదించారు.

సోషల్‌ మీడియాలో వైరల్‌గా..

ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌, పోలీసులు స్పందించారు. ఎస్పీ ధీరజ్‌ ఆదేశాలతో స్పెషల్‌ బ్రాంచ్‌, వాయల్పాడు పోలీసులతో కూడిన ప్రత్యేక బృందం వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ఎర్రగంట్లకు వెళ్లి ఏజెంట్లను విచారణ చేశారు. ప్రభుత్వం తరఫున ఇండియన్‌ ఎంబసీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ, ఒమన్‌లో ఆమె ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. అక్కడి అధికారుల సాయంతో ఆమెను రక్షించి, ముంబైకి తీసుకువచ్చారు. ముంబై నుంచి హైదరాబాద్‌కు, తర్వాత విజయవాడ నుంచి వాయల్పాడులోని వారి ఇంటికి చేర్చారు. ప్రయాణ ఖర్చులను ఉప ముఖ్యమంత్రి భరించారు. ప్రభుత్వానికి, పోలీసు సిబ్బందికి షహానాజ్‌ దంపతులు ధన్యవాదాలు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్‌.కృష్ణమోహన్‌, కలికిరి సీఐ అనిల్‌ కుమార్‌, వాయల్పాడు ఎస్‌ఐ తిప్పేస్వామి పాల్గొన్నారు.

ఎంబసీతో సమన్వయం చేసుకుంటూ

రప్పించిన ఎస్పీ

Advertisement
 
Advertisement
Advertisement