విద్యార్థి మృతిపై అన్నీ అనుమానాలే! | - | Sakshi
Sakshi News home page

విద్యార్థి మృతిపై అన్నీ అనుమానాలే!

May 10 2026 7:52 AM | Updated on May 10 2026 7:52 AM

మదనపల్లె టౌన్‌ : మదనపల్లెలో మిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థి మిద్దె పై నుంచి పడి మృతి చెందడం పాఠకులకు విదితమే. ఎంబీఏ విద్యార్థి మృతిపై కేసు నమోదు చేసిన మదనపల్లె రెండవ పట్టణ సీఐ మహమ్మద్‌ రఫీ మాట్లాడుతూ.. పుంగనూరు మండలం కుక్కలపల్లికి చెందిన గంగరాజు(24) కురబలకోట మండలం అంగళ్ళులోని మిట్స్‌ కళాశాలలో ఎంబీఏ చదువుతున్నాడని తెలిపారు. ఈ క్రమంలో తన స్వగ్రామానికి చెందిన స్నేహితుడు గోవర్ధన్‌ నాయక్‌ మదనపల్లె ఇందిరా నగర్‌లో బాడుగకు ఉంటూ, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆఫీస్‌ సబార్డినేట్‌గా పని చేస్తున్నాడు. గంగరాజు ఇంటికి వచ్చిన సమయంలో గోవర్ధన్‌ నాయక్‌ ఇంట్లో లేకుండా పోవడంతో.. అతని భార్యతో గంగ రాజు మాట్లాడుతుండగా సడన్‌గా వచ్చినట్లు సమాచారం. దీంతో గోవర్ధన్‌ నాయక్‌ భార్య దొంగా దొంగా అని కేకలు పెట్టడంతో.. భవనం మూడవ అంతస్తు పై నుంచి గంగరాజు తప్పించుకునే క్రమంలో కిందికి దూకి తీవ్రంగా గాయపడ్డాడని సీఐ తెలిపారు. ఆ సమయంలో తన వద్ద ఉన్న లాప్‌టాప్‌, సెల్‌ఫోన్‌ కూడా పగిలిపోయాయన్నారు. తీవ్రంగా గాయపడ్డ గంగరాజును విష్ణు నాయక్‌ వెంటనే స్థానిక జిల్లా ఆసుపత్రికి భార్యతో కలిసి తీసుకువెళ్లి ప్రథమ చికిత్సలు అందించినట్లు పేర్కొన్నారు. అయితే అతని పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ మృతి చెందాడని, దర్యాప్తులో తేలినట్లు పేర్కొన్నారు. మృతుడి తండ్రి రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా గంగరాజు మృతి మిస్టరీని తేల్చునున్నామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement