రాయచోటి అర్బన్ : అమెరికా దేశంలోని పెన్సిల్వేనియా రాష్ట్ర రాజధాని హారిస్‌బర్గ్ నగరంలో ఎన్‌ఆర్‌ఐలు, తెలుగు ప్రజలలు, వైఎస్సార్‌సీపీ అభిమానులతో శుక్రవారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి హృదయ పూర్వకంగా మమేకమయ్యారు. విదేశాల్లో స్థిరపడినా స్వదేశ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ భవిషత్యుపై తమకున్న అభిమానాన్ని, బాధ్యతను అక్కడి తెలుగు సమాజం మరోసారి స్పష్టంగా చాటి చెప్పింది. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రవాస తెలుగు ప్రజలు అక్కడి స్థానిక జీవన విధానం, అధునిక అభివృద్ధి నమూనాలు, ప్రజలకు అందుబాటులో ఉన్న మౌలిక వసతులపై తమ అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా భారతదేశంలో పేదరిక నిర్మూలనకు సమగ్ర ప్రణాళికలు, గ్రామీణ – పట్టణ ప్రాంతాల మధ్య సమాన అభివృద్ధి, యువతకు మెరుగైన అవకాశాలు కల్పించే విధానాలపై విలువైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడి, వారి అభిప్రాయాలను విన్నారు. విదేశాల్లో ఉన్న తెలుగు వారి అనుభవాలు, ఆలోచనలు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా వినియోగించాలనే సంకల్పాన్ని ఆయన వ్యక్తం చేశారు. అదే విధంగా వైఎస్సార్‌సీపీ బలోపేతంపై శ్రీకాంత్ రెడ్డి చర్చించారు.


