● ఒక్క అడుగు ముందుకు పడని అంగళ్లు మార్కెట్ కమిటీ
● రెండేళ్లుగా కాలయాపన చేస్తున్న కూటమి ప్రభుత్వం
● ఆవిరైన రైతుల ఆశలు
కురబలకోట : రైతులకు అండగా నిలవాల్సిన అంగళ్లు మార్కెట్ కమిటీ పేరుకు మాత్రమే పరిమితమైంది. ఆచరణకు ఆమడ దూరంలో ఉంది. కుర బలకోట, బి.కొత్తకోట మండలాల రైతుల కోసం ఏర్పాటైన ఈ మార్కెట్ కమిటీ కూటమి పాలనలో ఇంత వరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి రైతులకు అనుకూలంగా ప్రత్యేక చొరవ చూపారు. ములకలచెరువు మార్కెట్ కమిటీ నుంచి 2022లో దీనిని భైఫర్ కేషన్ (విభజన) చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో అంగళ్లు కేంద్రంగా ఏర్పాటైంది. తొలి చైర్మన్‌గా డీఆర్. ఉమాపతి రెడ్డి నియమితులయ్యారు. అప్పట్లో కురబలకోట రైల్వే ఫ్లై ఓవర్ (ఆర్‌ఓబీ) దగ్గర 15 ఎకరాల స్థలాన్ని కూడా సేకరించారు. కొత్త మార్కెట్ యార్డు నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా వెళ్లాయి. అప్పట్లో రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. టమాటా రైతులకు ఊరటగా ఉండగలదని ఆశించారు. అయితే తర్వాత ఎన్నికలు రావడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ మార్కెట్ కమిటీ పూర్తిగా మరుగున పడింది. ఇది ఉందన్న సంగతిని కూడా అందరూ మరచిపోయారు. ఇదివరలో అంగళ్లులోని సతీష్ బిల్డింగ్‌లో ఉన్న మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని కూడా స్థానికంగా కమతంపల్లి మార్గంలోకి మార్చారు. దీని పరిధిలో రెండు చెక్‌పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం అంగళ్లు పంచాయతీ అధ్వర్యంలో నడుస్తున్న టమాటా మార్కెట్, రెండు చెక్ పోస్టులు, ఇతర వాణిజ్య కార్యకలాపాల ద్వారా ఏడాదికి రూ.60 లక్షలకు పైగా ఆదాయం కూడా వస్తోంది. అంగళ్లు, బి.కొత్తకోట ప్రాంతాల్లో విస్తారంగా టమాటా సాగు చేస్తారు. మార్కెట్ యార్డు ఏర్పాటైతే ఎంతో సౌకర్యం. అయినా రెండేళ్లుగా ఎలాంటి ప్రగతి లేకపోవడంతో ఇది ఉన్నా లేనట్టేనని రైతులు పెదవి విరుస్తున్నారు. ఈ విషయమై అంగళ్లు మార్కెట్ కమిటీ కార్యాలయ కార్యదర్సి మదన్‌మోహన్‌రెడ్డిని విచారించగా మార్కెట్ యార్డు నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని వివిధ కారణాలతో ఉన్నతాధికారులు రద్దు చేశారన్నారు. కొత్తగా అంగళ్లు, ముదివేడు మార్గ మధ్యలో 20 ఎకరాల భూ సేకరణకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపారు. స్థలం కేటాయించగానే కొత్త మార్కెట్ యార్డు నిర్మాణానికి ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. పాలక వర్గం నియామకం ప్రభుత్వ పరిధిలో ఉందని తెలిపారు.


