అధికారం అండతో నిర్మాణ పనులు పూడ్చివేత | - | Sakshi
Sakshi News home page

అధికారం అండతో నిర్మాణ పనులు పూడ్చివేత

May 9 2026 8:02 AM | Updated on May 9 2026 8:02 AM

సాక్షి, మదనపల్లె : సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటారు అన్న కారణంగా వైఎస్సార్‌సీపీ నిమ్మనపల్లె మండలం సోషల్‌ మీడియా ఇన్‌చార్జి టి.రవితేజ చేపట్టిన నీటితొట్టె నిర్మాణాన్ని శుక్రవారం అధికారులు ఏకపక్షంగా జేసీబీతో పూడ్చివేశారు. 2005లో నిమ్మనపల్లిలో రవితేజ తల్లి సుజాతకు ఒకటిన్నర సెంటు పట్టా ఇచ్చారు. ఈమెతోపాటు మరికొందరికి ఇచ్చారు. ఈ ఇంటి స్థలం ఆవరణలో నీటి తొట్టి, మరుగుదొడ్డికి పిట్‌ నిర్మాణం కోసం గుంతలు తవ్వారు. దీనికోసం రూ.లక్ష దాకా ఖర్చు పెట్టారు. నీటి తొట్టె నిర్మాణం కోసం పనులు చేపడుతున్నా అధికారులకు అది ఆక్రమించి చేస్తున్న పనులు అని అడ్డగించలేదు. స్థలం అక్రమించి చేస్తున్న నిర్మాణం కూడా కాదు. అయితే ఎలాగైనా వేధించాలన్న టీడీపీ నేతల కుతంత్రంతో అధికారులను శుక్రవారం రంగంలోకి దింపారు. ఎస్‌ఐ, ఎంపీడీవో, పంచాయతీ ప్రత్యేక అధికారి, మహిళా పోలీసులు రవితేజ ఇంటి వద్దకు చేరుకున్నారు. తవ్విన గుంత ప్రభుత్వ స్థలంలో ఉందని ఆరోపించారు. నిర్మాణం పూడ్చేందుకు ప్రయత్నిస్తుండగా వద్దంటూ కుటుంబీకులు వేడుకుంటున్నా పట్టించుకోలేదు. ఒకవేళ ఆక్రమణ ఉంటే తామే పూడ్చివేస్తామని రవితేజ అధికారులకు చెబుతున్నా వినకుండా మొత్తం నిర్మాణ పనులను దగ్గరుండి జేసీబీతో పూడ్చి వేయించారు. నిర్మాణం కోసం అక్కడ ఉంచిన ఇటుకలు, సిమెంట్‌ పాడయ్యాయి. వైఎస్సార్‌సీపీలో రవితేజ చురుగ్గా వ్యవహరించడం టీడీపీ నేతలు జీర్జీంచుకోలేకపోతున్నారు. దీంతో ఎలాగైనా ఇబ్బందులకు గురి చేయాలన్న లక్ష్యంతో ఇంటి కోసం చేపట్టిన నీటితోట్టి నిర్మాణ పనులపై కక్ష సాధించారు. ప్రభుత్వ స్థలం ఆక్రమించలేదని, ఆక్రమణ ఉంటే తామే పూర్తి చేస్తామని చెబుతున్నా అధికారులు కనీసం పట్టించుకోలేదు. వచ్చిన పని అయ్యిందంటూ గుంతను పూడ్చి వెళ్లిపోయారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇంటి పనులపై కక్ష సాధిస్తారా అని ప్రశ్నిస్తున్నారు.

వైఎస్సార్‌సీపీ నాయకుడిపై కక్ష సాధింపు

Advertisement
 
Advertisement
Advertisement