పొలాలకు వెళ్లే దారి కోసం రైతుల పాట్లు | - | Sakshi
Sakshi News home page

పొలాలకు వెళ్లే దారి కోసం రైతుల పాట్లు

May 9 2026 8:02 AM | Updated on May 9 2026 8:02 AM

రాయచోటి : వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు దారి కావాలంటూ రైతులు నాలుగు నెలలుగా అధికారుల చూట్టూ తిరుగుతూ పడరాని పాట్లు పడుతున్నారు. మండల పరిధిలోని దేవపట్ల గ్రామం కట్టుగుత్తపల్లెకు చెందిన 20 మంది రైతులు శుక్రవారం వీరు తహసీల్దార్‌ కార్యాలయం వద్దకు వచ్చారు. అక్కడ తహసీల్దార్‌ సుబ్రమణ్యంరెడ్డి లేరు. సమస్య పరిష్కారం కాకపోవడంతో రైతులు కార్యాలయం ఎదుట మీడియాతో మాట్లాడుతూ కట్టుగుత్తపల్లెకు చెందిన ఓ వ్యక్తి డీకేటీ పొలంలో కాలువ సైతం పూడ్చి దారికి అడ్డుపడుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

సర్వే నంబర్‌ 1340–7లో చెంచయ్య, సుబ్బమ్మ పేర్లమీద డీకేటీ పట్టాలు ఇచ్చారు. సుబ్బమ్మ వృత్తి రీత్యా రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగికి ఎలా డీ పట్టా ఇచ్చారంటూ రైతులు ప్రశ్నించారు. ఇక్కడ పొలంలో దారి ఇస్తే తప్ప పైన ఉన్న రైతుల పొలాలకు వెళ్లే వీలుండదు. సర్వే నంబర్‌ 204లో రామ సుబ్బమ్మ పట్టాభూమి, 196–2లో జయరామ్‌కి సంబంధించి చుక్కుల భూమి ఉన్నట్లు తెలిపారు. వీరితో పాటు మరికొందరు రైతులు ఉన్నారు. పొలాల్లోకి దారి వేయకుండా అడ్డుపడుతున్న వ్యక్తిని అధికారులు పలు మార్లు పిలిచి మాట్లాడితే రైతులకు ఇక్కడ దారి ఇస్తే నేను పురుగుల మందుతాగి చనిపోతానని బెదిరిస్తూ అధికారు విధులకు భంగం కలిగిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుని సమస్యను వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని రైతులు ఉన్నతాధికారులను వేడుకొంటున్నారు. ఈ విషయంపై రెవెన్యూ అధికారులను వివరణ కోరగా అతను బెదిరింపులకు పాల్పడటం వాస్తవమేనని, అధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement