సాక్షి ప్రతినిధి, కడప: కడప మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం ఇష్టారాజ్యంగా నడుచుకుంటోంది. నిబంధనలతో నిమిత్తం లేకుండా దోపిడీదారులకు అండగా నిలుస్తోంది. టెండర్ బిడ్‌ను అడ్డగోలుగా రద్దు చేస్తూ అయినా వారికి కట్టబెట్టే చర్యలను ఎంచుకుంది. నిబంధనల మేరకు తక్కువ రేట్లకు కోట్ చేసిన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాల్సిందిపోయి, ఏకంగా టెండర్ బిడ్‌నే రద్దు చేశా రు. అదే పనికి తిరిగి టెండర్‌కు పిలవడం, అయిన వారికి కట్ట బెట్టడం ఇదే వరుసను కొనసాగిస్తున్నారు. తెలుగుతమ్ముళ్లుతో పనులు చేయించడం తర్వాత టెండర్లు తంతు ప్రక్రియను పూర్తి చేయిస్తున్నారు.
● కడప నగర పరిధిలోని పుష్పగిరి స్కూల్ రోడ్డు వెళ్లే రహదారిపై చంద్రవర్దిని నగర్ ఆర్చి నుంచి చివరి వరకు రోడ్డు వేసేందుకు (టెండర్ ఐడీ 903811) రూ.16.15లక్షలకు టెండర్లు పిలిచారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21న టెండర్లు పిలిచి 24వ తేది తుది గడువు నిర్ణయించారు. ఆ టెండర్లను ఓపెన్ చేయగా ఇద్దరు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. అందులో ఎస్వీఎస్‌ఎస్ కన్‌స్ట్రక్షన్ 1.17శాతం తక్కువకు కోట్ చేయగా, ఎస్.యల్లారెడ్డి 10.08శాతం తక్కువకు కోట్ చేశారు. 10శాతం తక్కువకు కోట్ చేసిన కాంట్రాక్టర్ యల్లారెడ్డి పనులు చేసేందుకు సుముఖంగా ఉన్నానని తనకు పనిని అప్పగించాలని కమిషనర్‌కు లేఖ కూడా ఇచ్చారు. అధికారులు తిరిగి అదే పనిని రీ టెండర్లకు ఆహ్వానించారు. 8వతేది శుక్రవారం సాయంత్రం 3వ కాల్‌గా టెండర్ కొనసాగించారు. ఇలా కార్పొరేషన్‌లో నిబంధనలు విరుద్ధంగా తెలుగుతమ్ముళ్లుకు వంతపాడుతున్నారు. దీన్నిబట్టి కడప మున్సిపల్ కార్పొరేషన్ ఎంత నీతివంతంగా పనిచేస్తుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
వింతపోకడలో ఇంజనీరింగ్ సెక్షన్...
కార్పొరేషన్‌లో ఇంజనీరింగ్ సెక్షన్ వింత పోకడలో ఉండిపోయింది. టెండర్లు బిడ్‌లో కాంట్రాక్టర్లు పాల్గొంటే బెదిరింపులకు దిగుతోందనే ఆరోపణలు వెంటాడుతున్నాయి. అయినప్పటికీ ఎవరైనా కాంట్రాక్టర్లు పాల్గొంటే విత్‌డ్రా చేయించడం లేదంటే టెండర్లు రద్దు చేయించడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. అలా కుదరకపోతే అనుకున్న వ్యక్తులతో పనులు ముందే చేయించి తర్వాత టెండర్లకు పోతున్నారు. ప్రస్తుతం చంద్రవర్ధిని నగర్ 3వ కాల్‌గా పిలిచిన 7921/జీఎఫ్/24–25/ఏటీఓ/ఎంసీకే బిడ్ అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఆ పనికి టీడీపీ నేతలతో ముందే చేయించారు. తర్వాత టెండర్లు పక్రియను కొనసాగించారు. ఇదే పక్రియ పరిపాటిగా ఇంజనీరింగ్ విభాగం కొనసాగిస్తోంది.
రోడ్డు ముందే వేయించి ఆపై టెండర్లు
10శాతం లెస్‌కు టెండర్ దాఖలు చేసినా బిడ్ రద్దు
తెలుగుతమ్ముళ్ల అక్రమార్జనకు అండగా యంత్రాంగం
ఇంజనీరింగ్ విభాగం అడ్డగోలు వ్యవహారం కారణంగా ఇటీవల తెలుగుతమ్ముళ్లు పరస్పరం తన్నుకున్నారు. అడ్డగోలు పనుల పందేరాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో పనుల కోసం ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోసాగారు. ఈ నేపధ్యంలో బుచ్చంపల్లెలో చేపట్టిన పనుల కోసం తెలుగుతమ్ముళ్లు ఇంజనీరింగ్ కార్యాయ లంలో పరస్పరం దాడులు చేసుకొని కార్యాలయం ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఇలాంటి అడ్డగోలు వ్యవహారాలకు మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం వేదికగా నిలుస్తోంది. ఇంతటి దుశ్చర్యలు కేఎంసీలో చోటుచేసుకుంటున్నా ప్రత్యేక అధికారిగా ఉన్న కలెక్టర్ శ్రీధర్‌లో కనీస స్పందన లేకపోవడంతోనే ఇంజనీరింగ్ విభాగం ఇష్టారాజ్యంగా వ్యవహహారిస్తోందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.


