అధ్యాపక నియామక నోటిఫికేషన్‌ రద్దు | - | Sakshi
Sakshi News home page

అధ్యాపక నియామక నోటిఫికేషన్‌ రద్దు

May 9 2026 7:32 AM | Updated on May 9 2026 7:32 AM

అధ్యాపక నియామక నోటిఫికేషన్‌ రద్దు ఆలయాల పునరుద్ధరణకు నిధులు మంజూరు భూ ఆక్రమణపై ఫిర్యాదు ముగిసిన అన్నమాచార్యుడి జయంత్యుత్సవాలు

కడప ఎడ్యుకేషన్‌: డాక్టర్‌ వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయం కార్యనిర్వాహక మండలి తీర్మానం, ప్రభుత్వ జీఓ నెం. 70 ప్రకారం గతంలో ఇచ్చిన 138 అధ్యాపక పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌ను రద్దు చేశామని రిజిస్ట్రార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, పొఫెసర్‌ పోస్టులు ఉన్నాయన్నారు. 2023 నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తు రుసుమును తిరిగి పొందేందుకు సంబంధిత సమాచారం కోసం విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ను పరిశీలించాలని పేర్కొన్నారు. కొత్త నోటిఫికేషన్ల తేదీలు, ఇతర వివరాలు విడిగా ప్రకటిస్తామని వివరించారు.

పీలేరు: నియోజకవర్గంలో వివిధ ఆలయాల పునరుద్ధరణకు సర్వశ్రేయో నిధులు రూ. 6.78 కోట్లు మంజూరైనట్లు దేవాదాయ శాఖ ఈఓ మంజుల తెలిపారు. శుక్రవారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడారు. పీలేరు మండలం దొడ్డిపల్లె పంచాయతీ శ్రీ చెన్నకేశవస్వామి ఆలయానికి రూ. 63,50,000, అన్నంగివారిపల్లె శ్రీ మాతమ్మ ఆలయానికి రూ. 75,00,000, వాల్మీకిపురం మండలం చింతపర్తిలో శ్రీ గుంటివీర గంగమ్మ ఆలయానికి రూ. రూ.కోటి, మంచూరు శ్రీ సోమేశ్వరస్వామి ఆలయానికి రూ. కోటి, గుర్రంకొండ మండలం చెర్లోపల్లె రెడ్డెమ్మతల్లి ఆలయానికి రూ. 2.20 కోట్లు, కలికిరి మండలం గుండ్లూరు శ్రీ చెన్నకేశవస్వామి ఆలయానికి రూ. 1.20 కోట్లు మంజూరైనట్లు వివరించారు.

సాక్షి, మదనపల్లె: బి.కొత్తకోట మండలంలోని బయ్యప్పగారిపల్లి గ్రామంలో సర్వేనెంబర్‌ 124 పక్కనున్న గుట్టలో భూ ఆక్రమణ జరిగిందని గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతోపాటు ఏ విధంగా ఆక్రమణ జరిగింది, వృక్ష సంపద ఎలా నాశనమైందో వివరిస్తూ ఆధారాలు సమర్పించారు. వివరాల్లోకి వెళితే.. తోకలపల్లి చెందిన రైతుల పేరిట ఉన్న పట్టా భూములకు ఆనుకొని గుట్ట ప్రాంతం ఉంది. దీనిపై కొంతమంది కన్నేశారు. గుట్టను తవ్వేసి, అందులోని చెట్లను నాశనం చేశారు. పర్యావరణం దెబ్బతినేలా భూమి స్వరూపాన్ని మార్చేసి ఆక్రమించారు. దీనివల్ల పర్యావరణకు నష్టం కలగడంతో గుట్ట ఆక్రమణ గురైందని ఫిర్యాదులో గ్రామస్తులు వివరించారు. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని విన్నవించారు. కాగా ఈ ఫిర్యాదుతో పాటు గతంలో గుట్ట ప్రాంతం ఎలా ఉండేది, ప్రస్తుతం ఎలా ఉంది, ఎంత ధ్వంసం అయింది అన్న వివరాలు తెలిపే ఫోటోలను ఫిర్యాదుతో పాటు అధికారులకు పంపించారు. దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

రాజంపేట: తాళ్లపాక అన్నమాచార్యుని జయంత్యుత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఉత్సవాల్లో చివరిరోజు తాళ్లపాక ధ్యానమందిరంలో మోహన్‌, గోపికృష్ణ బృందం సంకీరన్తలు ఆలపించారు. బోయనపల్లె గ్రామానికి చెందిన శ్రీ కోదండరామ కళానాట్యమండలి మహేంద్రస్వామి ఆధ్వర్యంలో తాళ్లపాక అన్నమాచార్య జీవిత ఘట్టాల ప్రదర్శన కన్నులపండువగా సాగింది. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్‌ సీ.లత, తాళ్లపాక దేవాలయాల ఇన్‌స్పెక్టర్‌ బాలాజీ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాలను ధర్మాచార్యులు గంగనపల్లె వెంకటరమణ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కార్యక్రమంలో కళాకారులు రూపరాజు, శిరీష, వెంకటసుబ్బయ్య, చెన్నారెడ్డి, నారాయణ యాదవ్‌, హర్మోనియం సుబ్బరాయుడు, వయోలిన్‌ చంగల్‌రాయులు, తబలా ప్రవీణకుమార్‌, శృతి రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement