రాజంపేట టౌన్: పట్టణంలోని బలిజపల్లె గ్రామంలో గత రెండు రోజులుగా జరిగిన గంగమ్మ జాతర ముగిసింది.శుక్రవారం ఉదయం అమ్మవారి ప్రతిమను ఊరేగింపుగా పొలిమేర్లకు సాగనంపడంతో ఈ ఏడాదికి జాతర ఘట్టం ఘనంగా పరిసమాప్తమైంది. గంగమ్మను పొలిమేర్లకు తరలించే ఊరేగింపు కార్యక్రమం వేకువ జామున ప్రారంభమై ఉదయం 8 గంటల వరకు సాగింది.ఈసందర్భంగా పలువురు భక్తులు గంగమ్మకు ఎదురుగుంభంగా ఇష్టమైన నైవేద్యాలను సమర్పించారు. ఆసాదులు దారిపొడవునా కథ చెబుతూ.. దీవెనలిస్తూ సాగారు. ఈ ఏడాది జాతరలో దాదాపు లక్షమందికి పైగా భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నట్లు నిర్వాహకుల అంచనా. భక్తులకు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, దాతలు గురువారం పొద్దుపోయే వరకు దారివెంబడి నీళ్లు,, మజ్జిగ పాకెట్లు, అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. జాతర నిర్వాహకులు, పోలీసు అధికారుల సమష్టి కృషి ఫలితంగా బలిజపల్లె గంగమ్మ జాతర ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఏఎస్పీ మనోజ్ రామ్‌నాథ్‌హెగ్డే ఆధ్వర్యంలో రాజంపేట అర్బన్, మన్నూరు సీఐలు, ఎస్‌ఐలు, వివిధ పోలీస్ స్టేషన్‌లకు చెందిన పోలీసు సిబ్బంది, ముఖ్యంగా మహిళా పోలీసులు రాత్రి వేళలో సైతం భక్తులకు ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనం కల్పించడంలో, అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా జాతర ప్రశాంత వాతావరణంలో ముగిసేందుకు కృషి చేశారు.
కోటి రూపాయలకు పైగా వ్యాపారం
బలిజపల్లె గంగమ్మ జాతరను పురస్కరించుకొని వివిధ రకాల వ్యాపారాలు జోరుగా సాగాయి. వందలాది మంది భక్తులు గంగమ్మకు నైవేద్యాలుగా పొట్టేళ్లు, మేకపోతులు, కోడిపుంజులు వంటివి సమర్పించారు. అలాగే బలిజపల్లె గ్రామంలోనే కాక పరిసర ప్రాంతాల్లో వ్యాపారులు వివిధ రకాల దుకాణాలు ఏర్పాటు చేశారు.ఈ ఏడాది దాదాపు కోటి రూపాయలకు పైగా వ్యాపారం జరిగి ఉంటుందని వ్యాపారులు అంటున్నారు.
ముగిసిన జాతర ఘట్టం
పొలిమేర్లకు తరలిన అమ్మవారు


