కడప సెవెన్‌రోడ్స్: గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి అధికారులను కోరారు. శుక్రవారం నిర్వహించిన జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశంలో ఆయన నీటి ఎద్దడిపై ఆరా తీశారు. ఇందుకు ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ఏడుకొండలు బదులిస్తూ రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, చక్రాయపేట, చెన్నూరు ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉందని తెలిపారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు. జెడ్పీ సీఈఓ సుబ్రమణ్యం మాట్లాడుతూ తమకు నిధులు కావాలంటూ తరచూ జెడ్పీటీసీలు అడుగుతుంటారని చెప్పారు. ఉపాధి హామీ పనులను సమర్థవంతంగా వినియోగించుకోగలిగితే నిధులు సమకూరుతాయని తెలిపారు. గ్రామీణ రహదారుల గురించి జెడ్పీ చైర్మన్ సమీక్షించారు. ఇందుకు పంచాయతీరాజ్ ఎస్‌ఈ బదులిస్తూ జిల్లాలో 20 బీటీ రోడ్ల మరమ్మతులకు రూ. 65 కోట్లు మంజూరయ్యాయని, ఈ పనులకు సంబంధించి టెండరు ప్రక్రియ జరుగుతోందన్నారు. 74 బీటీ రోడ్ల పనులు రూ. 35 కోట్ల తో, 79 మెటల్ రోడ్ల పనులు రూ. 17 కోట్లతో పూర్తి చేశామని వివరించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు త్వరగా చెల్లించాలని జెడ్పీ చైర్మన్ కోరారు. ఎర్రగుంట్ల జెడ్పీటీసీ బాలయ్య మాట్లాడుతూ జువారి సిమెంటు కర్మాగారం నిర్వహిస్తున్న బ్లాస్టింగ్ కారణంగా నాలుగు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఫ్యాక్టరీ నుంచి వచ్చే దుమ్ము ధూళి వద్ద ఇప్పటికే 10 మంది క్యాన్సర్ వ్యాధి బారిన పడి మృతి చెందారన్నారు. పోరుమామిళ్ల జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్ మాట్లాడుతూ తమ మండలంలో 15 ట్రాన్స్‌ఫార్మర్లను దొంగలు ఎత్తుకెళ్లారని, ఇందువల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి


