సాక్షి, మదనపల్లె: మదనపల్లె మున్సిపాలిటీలో తాగునీటి కలుషితంపై అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ ప్రత్యేక అధికారి, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ఆదేశించారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ఆయన కమీషనర్ కే. ప్రమీలతో కలిసి విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం సుదీర్ఘంగా నిర్వహించారు. తాగునీరు, అభివృద్ధి పనులు, పచ్చదనం, పారిశుద్ధ్యం, చెత్త సేకరణ, ఆదాయ మార్గాల పెంపు తదితర అంశాలపై విభాగాల వారిగా సమీక్షించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ మురికినీరు తాగునీటితో కలిసి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నీటి సరఫరా విషయంలో లోటు పాట్లు సరి చేసుకోవాలని, ఇబ్బంది లేకుండా ప్రజలకు తాగునీరు అందించాలన్నారు. మున్సిపాలిటీకి వస్తున్న ఆదాయాన్ని పెంచుకునేందుకు అందుబాటులో ఉన్న వనరులు, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు మెరుగైన పాలన అందించే దిశగా ప్రతి విభాగాధికారి స్పష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
మున్సిపాలిటీపై సమీక్షలో జేసీ


