సాక్షి, మదనపల్లె: కూటమిపాలనలో ఏపీలో చమురు ధరలకు రెక్కలు రావడంతో ప్రజలు చలో కర్ణాటక అంటూ అక్కడికి పరుగులు తీస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం విక్రయిస్తున్న ధరకు, ఆంధ్ర సరిహద్దులోని కర్ణాటకలో అక్కడ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఎంతో వ్యత్యాసం ఉంది. దీంతో వినియోగదారులు తమకు ఎంతోకొంత ఉపయోగమని, సొమ్ము మిగులుతుందని కర్ణాటకకు వెళ్లి డీజిల్, పెట్రోల్ కొనుగోలు చేస్తున్నారు. దీని ప్రభావంతో ఆంధ్రాలోని సరిహద్దు పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి.
ఆంధ్రాలో ధరల దోపిడీ
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో నిర్ణయించిన పెట్రోలు, డీజిల్ ధరలు ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేదని వినియోగదారులు అంటున్నారు. ప్రధానంగా అన్నమయ్య జిల్లా దక్షిణ ప్రాంతానికి సరిహద్దులో ఉన్న కర్ణాటకలో తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ దొరుకుతోంది. ఆంధ్రాలో పెట్రోల్ లీటరు రూ.115.11, డీజిల్ లీటర్ రూ.100.66తో వినియోగదారులు బంకుల్లో కొనుగోలు చేస్తున్నారు. కర్ణాటకలో పెట్రోల్ లీటర్ రూ.103.23, డీజిల్ లీటర్ రూ.91.29తో వినియోగదారులకు అందిస్తున్నారు. ఆంధ్ర కంటే కర్ణాటకలో లీటర్ పెట్రోల్ రూ.11.88, డీజిల్ లీటర్‌కు రూ.9.37 తక్కువ. ఈ ధర వ్యత్యాసం ఆంధ్ర ప్రాంత వినియోగదారులకు వరంగా మారింది. ఎక్కువ చమురు అవసరమైన వినియోగదారులు కర్ణాటక వైపు పరుగులు తీస్తున్నారు.
సరిహద్దు బంకుల మూత
ఆంధ్రలో చమురు ధరలు ఎక్కువగా ఉన్న కారణంగా కర్ణాటక సరిహద్దులోని ఏపీ చమురు బంకులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. సరిహద్దులో ఉన్నవారు, పది నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారు కర్ణాటకకు వెళ్లి చమురు తెచ్చుకుంటున్నారు. దీని కారణంగా తంబళ్లపల్లె నియోజకవర్గానికి సరిహద్దులోని ఆంధ్రకు చెందిన నాలుగు పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. ఇక్కడ చమురు కొనుగోలుకు వినియోగదారులు ఆసక్తి చూపించకపోవడంతో నిర్వహణ భారమై నిర్వాహకులు వాటిని వదిలించుకున్నారు.
సరిహద్దుల్లో కర్ణాటక బంకులు
సరిహద్దులోని ఆంధ్ర బంకులు మూతపడుతుంటే కర్ణాటకలో ఆంధ్ర సరిహద్దుకు సమీపంలో కొత్త పెట్రోల్ బంకులు ఏర్పాటు అవుతున్నాయి. బి. కొత్తకోట మండల సరిహద్దుకు రెండు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో, మదనపల్లి మండల సరిహద్దుల్లో, పెద్దతిప్పసముద్రం మండల సరిహద్దుల్లో కర్ణాటక రాష్ట్రానికి చెందిన బంకులు వెలుస్తున్నాయి. దాంతో ఈ బంకుల్లో వ్యాపారం పెరిగింది.
ఆంధ్ర సరిహద్దులో కర్ణాటకలో కొత్తగా
ప్రారంభించిన పెట్రోల్ బంకు
అక్కడ ధర తక్కువ
ఫలితంగా ఆంధ్రా పెట్రోల్ బంకుల మూత
సరిహద్దులో వెలుస్తున్న కర్ణాటక బంకులు
‘కర్ణాటక, తమిళనాడులో పెట్రోల్ ధర తక్కువ, ఇక్కడ ఎక్కువ ఏం తమ్ముళ్లు.. అక్కడికెళ్లి బండికి పెట్రోల్ కొట్టించి, మిగిలిన డబ్బుతో మీరు మందు కొట్టి ఎంచక్కా వస్తారు కదా’ అని ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు చేసిన వెటకారం గుర్తుండే ఉంటుంది. అప్పట్లో వెటకారం చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక చేసిందేమీ లేదని వినియోగదారులు మండిపడుతున్నారు.


