గుర్రంకొండ: జిల్లాలో ఇసుక అక్రమ రవాణకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. రాత్రింబవళ్లు ఇసుక తరలిపోతూనే ఉంది. దీనికితోడు పట్ట పగలు ఏంచక్కా పట్టలు కట్టుకోకుండా మరీ ఇసుక టిప్పర్లు వెళ్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. పట్టలు లేకపోవడంతో టిప్పర్ల దారి వెంబడి ఇసుక రోడ్డుపై రాలిపడుతోంది. గాలికి వెనుకపోయే వాహనదారుల కళ్లల్లో పడుతోంది. దీంతో ద్విచక్రవాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈవిషయమై వాహనదారులకు ఇసుక టిప్పర్ల డ్రైవర్లకు తరచూ ఘర్షణ జరుగుతోంది.
జిల్లా నలుమూలల నుంచి ఇసుక టిప్పర్లు గుర్రంకొండ మీదుగా మదనపల్లె వైపు, కర్ణాటక వైపు అనునిత్యం వెళుతున్నాయి. ప్రతిరోజు 30నుంచి 40 ఇసుక టిప్పర్లు రాత్రింబవళ్లు వెళుతున్నాయి. కనీసం ఈ టిప్పర్లకు అనుమతి ఉందా లేదా రికార్డులు సరిగ్గా ఉన్నాయా లేవా అని తనిఖీ చేసే అధికారులు కరువయ్యారు. గతంలో టిప్పర్లపైనుంచి ఇసుక గాలికి ఎగిరి వెనుకవైపు వచ్చే వాహనదారులు ఇబ్బంది పడకుండా ప్లాస్టిక్ పట్టగానీ నర్శరీ జాలీగానీ ఏర్పాటు చేసుకొని వెళ్లేవారు. ప్రస్తుతం ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టకుండా ఇష్టానుసారం జనావాసాల మధ్యలో వెళుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.
రాత్రింబవళ్లు టిప్పర్లలోజోరుగా ఇసుక రవాణా
పట్టలు కప్పకుండా వెళుతుండడంతోకళ్లల్లో పడుతున్న ఇసుక
వాహనదారుల మధ్య గొడవలు జరుగుతున్న వైనం


