నేటి నుంచి గండిలో మహాకుంభాభిషేక మహోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి గండిలో మహాకుంభాభిషేక మహోత్సవాలు

May 8 2026 11:02 AM | Updated on May 8 2026 11:02 AM

నేటి నుంచి గండిలో మహాకుంభాభిషేక మహోత్సవాలు

చక్రాయపేట: ప్రముఖ గండి వీరాంజనేయస్వామి సన్నిధిలో శుక్రవారం సాయంత్రం నుంచి మహాకుంభాభిషేక మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. నాలుగున్నరేళ్లుగా అంజన్న మూల విరాట్‌ దర్శనం లేక నిరుత్సాహంతో ఉన్న భక్తులకు కుంభాభిషేకం అనంతరం దర్శనం కలగనుంది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి సహకారంతో ఆలయ అభివృద్ధికి సుమారు రూ. 30 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో గండి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మహాకుంభాభిషేకం సందర్భంగా శుక్రవారం సాయంత్రం అంకురార్పణతో కార్యక్రమాలు మొదలవుతాయని ఆలయ కార్యనిర్వాహణాధికారి పట్టెం గురుప్రసాద్‌ తెలిపారు 9న శ్రీరామ సహస్ర లక్ష తులసీ అర్చన, 10న సీతా సహస్ర లక్ష కుంకుమార్చన, 11న ఆంజనేయ సహస్రనామ నాగవళ్లి దళార్చన, 12న హనుమజ్జయంతి సందర్భంగా మూలవర్లకు సహస్ర కలశాభిషేకం, చివరిరోజు 13న మహాపూర్ణాహుతి కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement