మధురఫలం.. విషతుల్యం | - | Sakshi
Sakshi News home page

మధురఫలం.. విషతుల్యం

May 8 2026 11:02 AM | Updated on May 8 2026 11:02 AM

కార్బైడ్‌తో ఆరోగ్యంపై తీవ్రప్రభావం

మార్కెట్‌లోకి విచ్చలవిడిగా పండ్లు

దాడులు చేసిన దాఖాలాలు లేవు

అమలుకాని ఆహారసంరక్షణ చట్టం

రాజంపేట : ఫలరాజుగా పేరొందిన మామిడి కొందరు వ్యాపారుల అత్యాశ.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా విషతుల్యంగా మారుతోంది. పక్వానికి రాకముందే కాయలను విష రసాయనాలతో కృత్రిమంగా మాగబెడుతున్నారు. నిషేధిత కాల్షియం కార్బైడ్‌, ఇతర ప్రమాదకర రసాయనాలను వినియోగిస్తున్నారు. కార్బైడ్‌తో మాగిన పండ్లు తిన్న వారికి అనారోగ్యసమస్యలు వస్తున్నాయి. ఒకసారి తిన్న వ్యక్తి మరోసారి తినేందుకు ఇష్టపడటంలేదు. రాజంపేట వ్యవసాయమార్కెట్‌ యార్డులో సౌకర్యాలు లేక రైల్వే కోడూరుకు మామిడి కాయలను తీసుకెళుతున్నారు.

ధరలేక.. తగ్గిన మామిడిసాగు..

మామిడికి సరైన ధర లేదనే కారణంతో జిల్లాలో మామిడి సాగు తగ్గిపోయింది. నిల్వ ఉంచుకునేందుకు ఏసీ గౌడౌన్లు లేవు. ఎగుమతులకు సరైన అవకాశాలు లేవు. దళారుల వల్ల మామిడి రైతులు నష్టపోతున్నారు. తినేవాడికి..పండించే వాడికి మధ్యలో దళారులకు లాభం చేకూరుతోంది. కాపు వచ్చేందుకు రైతులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు.

తియ్యటిపండ్ల వెనుక చేదు నిజాలు..

2011 ఆహార భద్రత ప్రమణాల ప్రకారం ప్రభుత్వం కార్బైడ్‌, ఎసిటిలిన్‌ రసాయనాలను నిషేధించింది, సహజంగా పండించే ఇథలిన్‌కు మాత్రమే 100 పీపీఎం వరకు వినియోగించేందుకు అనుమతి ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సుమారు 20కిలోల పండ్లకు 5 గ్రాముల ఇథలిన్‌ను వినియోగించాల్సి ఉంటుంది. వ్యాపారులు పండ్లు మేలిమిగా కనిపించేందుకు కార్బైడ్‌ను వినియోగిస్తున్నారు. అమోదించిన ఇథిలిన్‌తో పోల్చితే కార్బైడ్‌, ఇతర రసాయనాలు మార్కెట్‌లో చౌకగా లభిస్తాయి. త్వరగా పండ్లు మాగుతాయి. దీంతో వ్యాపారులు యథేచ్చగా కార్బైడ్‌ వాడుతున్నారు.

తింటే ఏమవుతుందంటే..

ప్రమాదకర రసాయనాలతో పక్వానికి వచ్చిన పండ్లను తింటే దీర్ఘకాలిక సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కడుపులో పుండ్లు ఏర్పడతాయి. కాలేయం, జీర్ణకోశం దెబ్బతింటాయని, క్యాన్సర్‌ వంటివి వ్యాపించే ప్రమాదం ఉందని, కాళ్లు, చేతులు, తిమ్మర్లు రావడం శరీరం పై మచ్చలు వస్తాయని చెబుతున్నారు. కాల్షియం కాౖర్బైడ్‌ ద్వారా వెలువడే ఎసిటిలిన్‌ వాయువు నాడీవ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపుతుందని, దీని వల్ల తలనొప్పి , దీర్ఘకాలిక మత్తు, శక్తిని కోల్పోయే ప్రమాదం ఉందంటున్నారు. చిన్నారుల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గి శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తుతాయని, గర్భిణుల్లో హోర్మన్లు దారితప్పుతాయని చెబుతున్నారు.

జరిమానా.. జైలు శిక్ష తప్పదు..

ఆహారసంరక్షణ ప్రమాణాల చట్టం–2006 ప్రకారం కాల్షియం కార్బైడ్‌, ఇతర రసాయనాలతో మామిడిపండ్లను మాగబెట్టినా, అమ్మినా ఏడాది జైలుశిక్ష, రూ.3 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే జిల్లాలో అధికారులు కొన్నేళ్లుగా దాడులు చేసిన దాఖాలాలు లేవు. దీంతో విచ్చలవిడిగా ప్రమాదకర రసాయనాలతో మాగబెట్టిన పండ్లను వ్యాపారులు విక్రయిస్తూ.. ప్రజారోగ్యంతో ఆడుకుంటున్నారు. వ్యాపారులు పండ్లు పక్వానికి రాకముందే కాయలు కోసి మండీలకు తరలించి కార్బైడ్‌ ఇతర ప్రమాదకర రసాయనాలు వినియోగించి మాగబెడుతున్నారు. మాగబెట్టిన వాటిని మార్కెట్లకు తరలించి విక్రయిస్తున్నారు. వీధి వ్యాపారులు మండ్లీలో నుంచి వీటిని తెచ్చుకొని వ్యాపారాలు సాగిస్తూ అనారోగ్యాన్ని పంచుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement