ఇలా అయితే ఎలా? | - | Sakshi
Sakshi News home page

ఇలా అయితే ఎలా?

May 8 2026 11:02 AM | Updated on May 8 2026 11:02 AM

సాక్షి, మదనపల్లె: ఆపదలో ఆదుకునే 108 అంబులెన్స్‌లు సంజీవనిగా ఉపయోగపడుతున్నాయి. అయితే మదనపల్లె జిల్లా ఆస్పత్రి నుంచి గురువారం ఒక్కరోజే ఆరు మండలాలకు చెందిన 108 అంబులెన్స్‌లు తిరుపతికి రోగులను తరలించాయి. దీంతో ఆరు మండలాల్లో 108 సేవలు స్తంభించిపోయాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాద ఘటనలు జరగకపోవడంతో ఇబ్బందులు తప్పాయి. గురువారంనాటి ఈ పరిస్థితికి సంబంధించిన వివరాలు.

ఏడు రెఫర్లు

వివిధ ప్రాంతాలకు చెందిన రోగులు గురువారం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి వచ్చారు. పరిశీలించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం అంటూ వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. వీరిని ఉచితంగా 108 అంబులెన్స్‌లో తరలించాల్సి ఉండడంతో రోగులు వీటిని సద్వినియోగం చేసుకున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కేసులను రెఫర్‌ చేశారు. మదనపల్లె పట్టణం, మదనపల్లె రూరల్‌ మండలాలకు కలిపి ఒకటే అంబులెన్స్‌ ఉంది. అయితే నాలుగు కేసులు ఒకేసారి తరలించాల్సి రావడంతో 108 అధికారులు పొరుగు మండలాలకు చెందిన అంబులెన్స్‌లను రప్పించాల్సి వచ్చింది. దీంతో మదనపల్లెతో పాటు, నిమ్మనపల్లె, బి.కొత్తకోట, కురబలకోటలకు అంబులెన్స్‌లను రప్పించారు. ఇందులో శ్వాస, ప్రసవ, జ్వరం సంబంధిత వ్యక్తులను తిరుపతి రుయాకు తరలించారు. తర్వాత సాయంత్రం నుంచి రాత్రి 8 గంటల వరకు మరో ముగ్గురు రోగులను తరలించాలని వైద్యులు రెఫర్‌ చేశారు. ఉదయం రుయాకు వెళ్లి వచ్చిన మదనపల్లె అంబులెన్స్‌తో పాటు పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి, పీలేరు నియోజకవర్గం వాయల్పాడు కు చెందిన అంబులెన్స్‌లను రప్పించారు. వీటిలో ఒక పాయిజన్‌, ఒక శ్వాస సంబంధిత, ఒక కాలిన గాయాలకు చెందిన బాధితులను రుయాకు తరలించారు. ఇందులో మదనపల్లె అంబులెన్స్‌ ఒకే రోజు రెండుసార్లు తిరుపతికి వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఆరు మండలాలకు చెందిన అంబులెన్స్‌లు ఒక్కటి కూడా స్థానికంగా లేకుండా పోయాయి.

పొరుగు మండలాలకు ఇబ్బందులు

స్థానిక జిల్లా ఆసుపత్రి నుంచి రోగులను తిరుపతికి రెఫర్‌ చేస్తూ ఉండడంతో అంబులెన్స్‌ల పరిస్థితి దయనీయంగా మారింది. మదనపల్లె నుంచి తిరుపతికి 115 కిలోమీటర్ల దూరం ఉంది. రాను పోను 230 కిలోమీటర్లు. రోజుకు ఒకసారి వెళ్లి వస్తే సగం రోజుకు పైగా గడిచిపోతుంది. ఈ రెఫర్ల ఫలితంగా పొరుగు మండలాలకు చెందిన అంబులెన్స్‌లను కూడా వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని కారణంగా ఆ మండలాల్లో ఏదైనా ప్రమాద ఘటన జరిగినా, బాధితులకు ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడినా సకాలంలో వైద్యం కోసం ఆసుపత్రులకు తరలించే పరిస్థితి లేదు. ప్రైవేట్‌ వాహనాలను సమకూర్చుకునే అవకాశం ఉన్నప్పటికీ అప్పటికే సమయం వృథా అయ్యి ప్రాణాపాయ పరిస్థితికి దారి తీయవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచాల్సిన అవసరం చాలా ఉంది. గురువారం ఆరు మండలాలకు చెందిన అంబులెన్స్‌లు స్థానికంగా అందుబాటులో లేవు. అదృష్టవశాత్తు ఈ మండలాల్లో ఎలాంటి ఘటనలు జరగకపోవడంతో ఇబ్బందులు తప్పాయి. ఇలాంటి పరిస్థితులు ప్రతిరోజూ నెలకొంటే ఆందోళన తప్పకపోవచ్చు. ఇలాంటి పరిస్థితులు పునరావృత్తం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కాగా గురువారం ఒకరోజే మదనపల్లె నుంచి తిరుపతికి ఏడు రెఫర్లు జరిగిన విషయాన్ని 108 ఆంబులెన్స్‌ వర్గాలు ధ్రువీకరించాయి.

తిరుపతి రెఫర్లతో 108 అంబులెన్స్‌లు ఖాళీ

మదనపల్లె వాహనం రెండుసార్లు,

బి.కొత్తకోట, చౌడేపల్లి, వాయల్పాడు, నిమ్మనపల్లి,

రామసముద్రం 108లు ఒక్కోసారి తిరుపతికి

Advertisement
 
Advertisement
Advertisement