మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా, మదనపల్లెలో గురువారం కడపకు చెందిన విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. విజిలెన్స్ ఎస్పీ కరీముల్లా ఆదేశాలతో సీఐ శ్రీనివాసులు రెడ్డి, అగ్రికల్చర్ ఏడి లక్ష్మణరావుల బృందం మదనపల్లె పట్టణంలోని ఈశ్వరమ్మ కాలనీలో రేషన్ బియ్యం వ్యాపారి హబీబ్ ఇంట్లో దాడులు జరిగాయి. అక్రమంగా నిల్వ ఉన్న 33 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. అనంతరం రెవెన్యూ అధికారుల సమక్షంలో హబీబ్ నిల్వఉంచిన రూ.1.75లక్షల విలువచేసే 33 క్వింటాల్ల బియ్యాన్ని సీజ్ చేశారు. ఎస్పీ ఆదేశాలతో పట్టుబడిన బియా న్ని స్థానిక నీరుగట్టువారిపల్లెలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో ఉన్న పౌరసరఫరాలశాఖ గోడౌన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
వేఽధింపుల కేసులో
ముగ్గురికి జైలు శిక్ష
తంబళ్లపల్లె : వేధింపుల కేసులో భర్తతో సహా అత్త, మామలకు జైలు శిక్ష విధిస్తూ తంబళ్లపల్లె సివిల్ కోర్టు న్యాయమూర్తి ఉమర్‌ఫరూక్ గురువారం తీర్పు చెప్పారు. వివరాలు.. తంబళ్లపల్లె మండలం గుండ్లపల్లెకు చెందిన అంజలికి సత్యసాయి జిల్లా తనకల్లు మండలం ఈతోడు గ్రామానికి చెందిన రెడ్డిశేఖర్‌తో వివాహం జరిగింది. భర్త రెడ్డిశేఖర్, అత్తమామలు రామచంద్ర,యశోదమ్మ వేధిస్తున్నారని 2018లో తంబళ్లపల్లె పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో రెడ్డిశేఖర్ కు ఆరు నెలలు జైలు శిక్ష, రూ.1000 జరిమానా, రామచంద్ర,యశోదమ్మకు మూడు నెలల జైలు, 1000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె టౌన్ : నిప్పు అంటించుకుని వ్యక్తి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన గురువారం పెద్దతిప్ప సముద్రం మండలంలో జరిగింది. బాధితుల కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని బూర్లపల్లి కు చెందిన కోనప్ప కొడుకు నరసింహులు(49) కుటుంబ సమస్యల కారణంగా తన ఇంటి వద్దనే పెట్రోల్ మీద పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. కుటుంబీకులు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి మంటలు అదుపుచేసి బాధితుడిని మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించారు. అతని పరిస్థితి విషమించిందని తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పీటీఎం పోలీసులు తెలిపారు.


