సాక్షి. మదనపల్లె : పలమనేరు–కుప్పం–మదనపల్లె పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సంస్థ చైర్మన్ బీఆర్.సురేష్ బాబు, వైస్ చైర్మన్, జేసీ శివ్ నారాయణ్ శర్మ కోరారు. గురువారం స్థానిక కార్యాలయంలో పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గం గుడిపల్లె మండలం గుండ్లసాగరం గ్రామపంచాయతీలో 30.865 ఎకరాల భూమిలో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద అభివృద్ధి చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్లు చెప్పారు. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా లేఔట్ ప్లాన్లు రూపొందించడం, ప్లాట్ల విభజన, రహదారులు, డ్రైనేజీలు, విద్యుత్, తాగునీటి సదుపాయాలకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సంస్థ పరిధిలోని అనధికార లేఔట్లను గుర్తించి జీవో ప్రకారం యజమానులకు పంచాయతీ కార్యదర్శుల ద్వారా నోటీసులు జారీ చేయాలన్నారు. సమావేశంలో సెక్రటరీ పిఆర్.మనోహర్, పరిపాలనాధికారి చిట్టిబాబు, అసిస్టెంట్ ప్లానింగ్ అధికారి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, ప్లానింగ్ సెక్రటరీలు పాల్గొన్నారు.
ఉడా చైర్మన్ సురేష్ బాబు,
వైస్ చైర్మన్ శివ్ నారాయణ్ శర్మ


