గడ్డి కట్టర్‌లో పడి వృద్ధురాలికి తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

గడ్డి కట్టర్‌లో పడి వృద్ధురాలికి తీవ్ర గాయాలు

May 8 2026 11:02 AM | Updated on May 8 2026 11:02 AM

మదనపల్లె టౌన్‌ : పశువులకు గడ్డి కోసి చాఫ్‌ కట్టర్‌లో వేస్తుండగా ప్రమాద వశాత్తు చేయి యంత్రంలో పడి ఓ వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన పీటీఎం మండలంలో గురువారం చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అంకిరెడ్డిపల్లికి చెందిన బయారెడ్డి భార్య రమణమ్మ (60) గురు వారం ఇంటి వద్ద పశువులకు గడ్డి కోసి చాఫ్‌కట్టర్‌తో కత్తిరిస్తున్నారు. ఆ సమయంలో ప్రమాద వశాత్తు ఆమె కుడి చేయి యంత్రంలో పడిపోయింది. దీంతో చేయి మణికట్టు వరకు నుజ్జునుజ్జు అయింది. గమనించిన కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు పరుగున వచ్చి మిషన్‌ను ఆపి, ఆమెను బయటకు తీశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రైవేట్‌ వాహనంలో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి రెఫర్‌ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అధికారుల సూచన

గడ్డి కటింగ్‌ మిషన్లు, చాఫ్‌ కట్టర్లు వాడేటప్పుడు మహిళలు వదులు దుస్తులు, చీరలు ధరించవద్దని, చేతికి గ్లౌజులు వేసుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement