పుంగనూరు : పట్టణంలోని చెరువు కట్టపై గల సయ్యద్ నూర్‌షావలి బాబా దర్గా ఉరుసు ఉత్సవాన్ని శతాబ్దకాలంగా ముస్లింలు నిర్వహిస్తున్నారు. ఈ ఉరుసు గురువారం నూరాని గంధంతో ప్రారంభమైంది. శుక్రవారం పట్టణంలోని కుమ్మరవీధిలో ఉండు పహిల్వాన్‌సాబ్ ఇంటి నుంచి దర్గా వరకు గంధం ఊరేగింపుగా తీసుకొచ్చి దువా చేస్తారు. ప్రతి రోజు ఉరుసుకు వచ్చే వారికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉరుసు సందర్భంగా ప్రతి రోజు రాత్రి దర్గా కమిటీ వారు ఖవ్వాలి పాటల పోటీలు ఏర్పాటు చేశారు. 9, 10 తేదీల్లో రాత్రి నాగపూర్‌కు చెందిన ఇంతియాజ్‌సాబిరి, ముంబైకి చెందిన అంజాబ్‌సాబిరి , పూనేకు చెందిన తౌసిఫ్‌జునైది , కర్ణాటకకు చెందిన తౌసిఫ్‌ఖాదరిలతో ఖవ్వాలి పాటల పోటీలు జరుగుతాయి.
సయ్యద్ నూర్‌షావలి బాబా దర్గాను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉరుసు సందర్భంగా ముస్లిం మతపెద్దలు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉరుసును ప్రతి ఏటా ఎన్‌ఎస్.పేటలోగల ప్రభుత్వ కళాశాల మైదానంలో నిర్వహించడం ఆనవాయితీ. మైదానంలో రంగుల రాట్నాలు, దుకాణాలను ఏర్పాటు చేశారు. ఉరుసు నాలుగు రోజుల పాటు జరుగుతుంది. కానీ 10 రోజుల పాటు ఉరుసు కార్యక్రమం జరుగతుంది. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ నుంచి కూడా వేలాది మంది ఉరుసు ఉత్సవంలో పాల్గోనేందుకు తరలివస్తున్నారు. కమిటీ ఆధ్వర్యంలో సీఐ సుబ్బరాయుడు, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బెంగళూరు రహదారి కావడంతో వాహనాల మళ్లింపు కార్యక్రమం చేపట్టారు.


