స్మార్ట్‌గా మంట పెడుతున్నారు ! | - | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌గా మంట పెడుతున్నారు !

May 6 2026 7:55 AM | Updated on May 6 2026 7:55 AM

నాణ్యమైన భోజనం వండి వడ్డిస్తున్నారు

కొత్త విధానంలో రోడ్డున పడతారు...

మధ్యాహ్న భోజన కార్మికులపై

‘స్మార్ట్‌’కిచెన్‌ పిడుగు

స్మార్ట్‌ కిచెన్‌ల ద్వారా మధ్యాహ్న

భోజనం అందించే దిశగా అడుగులు

ఇప్పటికే నాలుగు మండలాల్లో అమలు

త్వరలో మిగతా మండలాల్లో కూడా అమలుకు శ్రీకారం

కడప ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని స్మార్ట్‌ కిచెన్‌ల ద్వారా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీంతో మధ్యాహ్న భోజన కార్మికులు తమ ఉపాధిని కోల్పోతామేమోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఇప్పటికే నాలుగు మండలాల్లో ఈ స్మార్ట్‌ కిచెన్‌ను ప్రారంభించి అక్కడ నుంచి మధ్యాహ్న భోజనాన్ని పాఠశాలలకు తరలించి పిల్లలకు వడ్డిస్తున్నారు. ఇక మిగిలిన మండలాల్లో కూడా త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇలా చేస్తే తమ పరిస్థితేంటని జిల్లాలో సుమారు 2980 మంది మధ్యాహ్న భోజన కార్మికుల ఆందోళన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం తమను తొలగించే కుట్ర చేయడంతో పాటు .. కూటమి వర్గీయుల జేబులు నింపేందుకే స్మార్ట్‌ కిచెన్‌లు ఏర్పాటు చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు.

విద్యార్థుల సంఖ్యను బట్టి....

మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి స్మార్ట్‌ కిచెన్‌లు ఏర్పాటు చేస్తోంది. 1500 నుంచి 2000 వేల మంది విద్యార్థులకు ఒక స్మార్ట్‌ కిచెన్‌ ఉంటుందని విద్యార్థుల సంఖ్యను బట్టి మండలానికి ఒకటి లేదా రెండు స్మార్ట్‌ కిచెన్‌లు ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లాలో కడప, సీకేదిన్నె, జమ్మలమడుగు, దేవగుడిలలో స్మార్ట్‌ కిచెన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి అక్కడ నుంచి పాఠశాలలకు మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తూ పిల్లలకు వడ్డిస్తున్నారు. మిగతా మండలాల్లో కూడా చాలా మేర స్మార్ట్‌ చికెన్‌ షెడ్డు నిర్మాణ దశల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రశ్నార్థకంగా కార్మికుల భవిష్యత్తు...

జిల్లావ్యాప్తంగా 20 ఏళ్లకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్మికులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం వారికి నెలకు రూ. 3 వేల గౌరవ వేతనంతోపాటు హైస్కూల్లో విద్యార్థికి రూ. 8.55, ప్రాథమిక పాఠశాలల్లో రూ. 5.50 చొప్పున డబ్బులు చెల్లిస్తున్నారు. చాలీ చాలనీ జీతాలతో ఏళ్ల తరబడి ఆ వృత్తిలో కొనసాగుతున్నారు. స్మార్ట్‌ కిచెన్‌ ఏర్పాటుతో ఉపాధి కోల్పోతామని కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని

సిద్ధం చేస్తున్న ఏజెన్సీ నిర్వాహకులు

నూతనంగా ఏర్పాటు చేసిన

స్మార్ట్‌ కిచెన్‌లో వంట తయారీ చేస్తూ

కూటమి ప్రభుత్వం చిరుకూలీల పొట్టకొడుతోంది. పొమ్మనలేక ‘స్మార్ట్‌’గా మంట

పెడుతోంది. అవును.. ఇన్నాళ్లు వంటనే నమ్ముకుని బతుకుతున్న మధ్యాహ్న భోజన కార్మికలోకం తమ ఉపాధిని ‘స్మార్ట్‌ కిచెన్‌’ లాగేసుకుంటుందేమోనని కలవరపడుతోంది.

పాఠశాలలో పిల్లలకు వంట ఏజెన్సీలు వేడివేడిగా అన్నం వండి వడ్డిస్తున్నారు. ఎక్కడో వండిన అన్నం అన్ని పాఠశాలకు వాహనాల్లో తీసుకొచ్చి వడ్డిస్తే అధి చల్లబడడంతోపాటు మెత్తగా తయారవుతుంది. ఏ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని అక్కడే కొనసాగించాలి.

– చాన్‌బాషా, మధ్యాహ్న భోజన పథక గౌరవాధ్యక్షుడు

ప్రభుత్వం తీసుకొచ్చిన స్మార్ట్‌ కిచెన్‌ విధానంతో జిల్లాలో చాలా మంది పేద మహిళల కుటుంబాలు రోడ్డున పడనున్నాయి. ఇప్పటికే మా డిమాండ్‌లను అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. చాలా మంది ఏళ్లుగా పనిచేస్తున్నారు. గతంలో ఎన్నడు ఇలాంటి ఇబ్బందులు కలగలేదు, స్మార్ట్‌ కిచెన్‌ విధానాన్ని వెనక్కు తీసుకోవాలి.

– మేరీ, మధ్యాహ్న భోజనం వర్కిర్‌ యూనియన్‌ నాయకురాలు

Advertisement
 
Advertisement
Advertisement