పవిత్ర లడ్డూ ప్రసాదమేదీ ! | - | Sakshi
Sakshi News home page

పవిత్ర లడ్డూ ప్రసాదమేదీ !

May 6 2026 7:55 AM | Updated on May 6 2026 7:55 AM

జమ్మలమడుగు: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కొనసాగే నారాపురస్వామి బ్రహ్మోత్సవాల్లో తిరుమల లడ్డూ ప్రసాదం అందుబాటులో లేకపోవడంపై భక్తుల్లో అసంతృప్తి నెలకొంది. ఏటా వైశాఖ మాసంలో జరిగే నారాపురస్వామి బ్రహ్మోత్సవాలలో పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు సైతం స్వామి వారి అలంకారాలను వీక్షించటానికి సాయంత్రం పూట వేలాది మంది వస్తుంటారు. ఉత్సవాల్లో స్వామివారం పవిత్ర లడ్డూ ప్రసాదం లేకపోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు.

కల్యాణోత్సవాన్ని తిలకించలేమా!

నారాపుర స్వామి బ్రహ్మోత్సవాలలో బుధవారం సాయంత్రం స్వామి వారికి కల్యాణోత్సవం జరగనుంది. రూ.300 రుసుం చెల్లించిన వారికి మాత్రమే ఈ కల్యాణోత్సవంలో పాల్గొనాలని.. చెల్లించనివారు బయటి నుంచి వీక్షించే విధంగా టీటీడీ కొత్త నిబంధన తీసుకొచ్చింది. దీంతో భక్తులు భగ్గుమంటున్నారు. గతంలో స్వామి వారి కల్యాణోత్సవాన్ని భక్తులందరూ తిలకించేవారు.

టీటీడీలో కలిసి దాదాపు 20 సంవత్సరాలు..

నారాపుర స్వామి ఆలయాన్ని సుమారు రెండు దశాబ్దాల క్రితం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో టీటీడీలో వీలినం చేశారు. అప్పటి నుంచి స్వామి వారికి తిరుమల తిరుపతి దేవస్థానం సాంప్రదాయ ప్రకారం స్వామి వారికి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. ఏటా జరిగే బ్రహ్మోత్సవాలలో తిరుమల లడ్డు ప్రసాదాలను అందుబాటులో ఉంచుతారు. ఈసారి బ్రహ్మోత్సవాలకు ఇప్పటివరకు టీటీడీ అధికారులు లడ్లు సరఫరా చేయలేదు. సాధారణ సమయంలో లడ్డూ ప్రసాదం లేకున్నా పర్వాలేదు గానీ.. ఉత్సవాల సమయంలోనైనా లడ్డు ప్రసాదం అందుబాటులోకి తీసుకురావాలని భక్తులు కోరుతున్నారు.

తిరుమల లడ్లు అందుబాటులోకి తేవాలి..

నారాపురస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు టీటీడీ తిరుమల లడ్డు ప్రసాదం అందుబాటులోనికి తీసుకురావాలి. ఈ బ్రహ్మోత్సవాలకు భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. లడ్డూ ప్రసాదం లేకపోవడంపై భక్తులు నిరాశ చెందుతున్నారు. టీటీడీ అధికారులు అలోచించి భక్తులకు తిరుమల లడ్డు ప్రసాదం అందుబాటులోకి తీసుకురావాలి. – భూతమాపురం సుబ్బారావు,

న్యాయవాది, జమ్మలమడుగు.

Advertisement
 
Advertisement
Advertisement