● ఇబ్బంది పడుతున్న వేతనదారులు
● వెంటాడుతున్న సాంకేతిక కష్టాలు
● పాత పద్ధతి మేలు అంటున్న కూలీలు
గాలివీడు : రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కూలీలకు సాంకేతికత శాపంగా మారింది. ఉపాధి హామీ పథకంలో పారదర్శకత పేరుతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఫేస్ రికగ్నిషన్’ (ముఖ గుర్తింపు) హాజరు విధానం క్షేత్రస్థాయిలో విఫలమవుతోంది. గాలివీడు మండలంలోని మారుమూల గ్రామాల్లో సిగ్నల్ సమస్యలు, యాప్ సర్వర్ లోపాల కారణంగా కూలీలు పనుల కంటే హాజరు కోసమే ఎండలో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ప్రభుత్వం తమ కడుపు కొట్టేలా ప్రవర్తిస్తోందని, తక్షణమే పాత పద్ధతిలోనే హాజరు సేకరించాలని వేతనదారులు డిమాండ్ చేస్తున్నారు.
తీవ్ర అవస్థలు
మండలంలోని ఉపాధి హామీ కూలీలకు సాంకేతిక కష్టాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా హాజరు నమోదు చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందుల వల్ల పేద కూలీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.
క్షేత్రస్థాయిలో సమస్యలు
ఫెస్ యాప్ ప్రారంభించినప్పటి నుంచి మండలంలోని మారుమూల గ్రామాల్లో ఉపాధి పనుల కోసం వచ్చిన కూలీలు పని కంటే ఎక్కువగా హాజరు కోసమే వేచి చూడాల్సి వస్తోంది. ఐరిస్ నమోదులో జాప్యం జరుగుతోంది. ఉదయాన్నే పనులకు వెళ్లిన కూలీలు గంటల తరబడి ఐరిస్ (కంటి గుర్తింపు) నమోదు కోసం నిరీక్షించాల్సి వస్తోంది.
సిగ్నిల్ సమస్యలతో..
క్షేత్ర స్థాయిలో సిగ్నల్ సమస్యలు లేదా యాప్‌లో తలెత్తుతున్న సాంకేతిక లోపాల వల్ల హాజరు నమోదు కావడం లేదు. దీనివల్ల కష్టపడి పని చేసినా, హాజరు పడకపోతే వేతనం రాదనే భయం కూలీలను వెంటాడుతోంది.
పనులకు దూరం : ఈ కొత్త నిబంధనల వల్ల పనులకు సమయం వృథా అవుతోందని, ఆసలు పని కంటే ఈ యాప్‌ల గోలే ఎక్కువగా ఉందని కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి తిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. వేతనదారులు పడే ఇబ్బందులను ప్రభుత్వం తక్షణమే గుర్తించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి నిబంధనలతో కూలీలు పనులకు దూరమయ్యే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.
సాంకేతిక సమస్యలు పరిష్కరిస్తున్నాం
కూలీలు ఫెస్ యాప్ తీసుకునే సమయంలో సంకేతిక సమస్యలు తలెత్తుతున్నప్పటికీ, ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరిస్తున్నాం. సర్వర్ డౌన్ అయినప్పుడు ఫొటోలను సేవ్ చేసుకుని తదుపరి అప్లోడ్ చేస్తున్నాం. ఈ క్రమంలో సమయం కూడా వృథా అవుతోంది.
– రామచంద్ర, ఏపీఓ, గాలివీడు


