వాహనం ఢీకొని రిటైర్డ్‌ ఉద్యోగి మృతి | - | Sakshi
Sakshi News home page

వాహనం ఢీకొని రిటైర్డ్‌ ఉద్యోగి మృతి

May 6 2026 7:55 AM | Updated on May 6 2026 7:55 AM

పీలేరు రూరల్‌ : గుర్తు తెలియని వాహనం ఢీకొని రిటైర్డ్‌ ఆర్టీసీ ఉద్యోగి మృతి చెందిన సంఘటన స్థానిక కడప మార్గంలోని కేవీఆర్‌ లడ్జీ సమీపంలో చోటు చేసుకుంది. వివరాలిలా వున్నాయి. కేవీపల్లె మండలం తీతవగుంటపల్లెకు చెందిన మిన్నంరెడ్డి సుధాకర్‌రెడ్డి(62) ఆర్టీసీ ఉద్యోగిగా పని చేసి రిటైర్డ్‌ అయ్యారు. స్థానిక కడప రోడ్డు మార్గం ఎస్‌ఆర్‌ నగర్‌లో నివాసముంటున్న ఆయన మంగళవారం సాయంత్రం కడప రోడ్డు మార్గంలో వాకింగ్‌ వెళ్లడానికి ఇంటి నుంచి రోడ్డుపైకి వచ్చారు. గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొనడంతో సుధాకర్‌రెడ్డి తీవ్ర గాయాలతో కుప్పకూలిపోయాడు. ఆయన్ను చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తేనెటీగల దాడి

మదనపల్లె టౌన్‌ : తేనెటీగల దాడిలో పలువురు గాయపడ్డ సంఘటన మంగళవారం కురబలకోట మండలంలో జరిగింది. ఘటనపై బాధితుల కథనం.. ముదివేడుకు చెందిన నిర్మలమ్మ(60), చంద్రశేఖర్‌రెడ్డి(50), నిర్మల(40), వారి పిల్లలు గీతిక(7), ఫియాన్సి(5)లు ఊరికి సమీపంలోని వ్యవసాయ బావి దగ్గరకు వెళ్లారు. ఆ సమయంలో పెద్దపెరా తేనెటీగల గుంపు వచ్చి దాడి చేసింది. తేనెటీగల దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితులను స్థానికులు వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి నిర్మలమ్మ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వెంటనే తిరుపతికి తరలించారు. మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.

కాఫీ మీద పడి..

బాలుడిపై కాఫీ పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం మదనపల్లిలో జరిగింది. బాధితుడి కుటుంబీకుల కథనం మేరకు.. మదనపల్లి పట్టణం కొత్త ఇండ్లలో కాపురం ఉంటున్న దంపతులు రామాంజులు, రాణెమ్మలు తాము ఉంటున్న అద్దె ఇల్లును ఖాళీ చేసేందుకు సామగ్రిని సర్ది మూటల్లో భద్రపరిచారు. అలసిపోయిన దంపతులు కాఫీ తాగాలి అనుకున్నారు. వెంటనే రాణి వెళ్లి కాఫీ పెట్టుకుని వచ్చి భర్తకు ఒక గ్లాసులో పోసి తాగమని టేబులుపై పెట్టింది. అదే సమయంలో ఆడుకుంటూ అక్కడికి వచ్చిన ఏడాది కొడుకు నవీన్‌ కాఫీని చేత్తో పట్టుకొని మీద పోసుకున్నాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ బాలుడిని తల్లిదండ్రులు చికిత్స కోసం స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు చెప్పడంతో, మెరుగైన వైద్యం కోసం వెంటనే తిరుపతి రుయాకు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement