మదనపల్లె టౌన్ : పురుగుల మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన మంగళవారం రాయచోటిలో జరిగింది. ఇందుకు సంబంధించి బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. సత్యసాయి జిల్లా కదిరి బాపనపల్లెకు చెందిన నారాయణస్వామి కొడుకు ఎం.రెడ్డిప్ప(30) తన భార్య అంజలితో కలిసి రోజూ పల్లెలకు బట్టల వ్యాపారం చేయడానికి వెళ్లేవాడు. ఈ క్రమంలో రెడ్డప్ప తన స్నేహితులతో కలిసి రాయిచోటి సమీపాన పల్లెలకు బట్టల వ్యాపారం చేసేందుకు వెళ్ళాడు. పల్లెల్లో వ్యాపారం ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు రాయచోటి బస్టాండ్కు వచ్చాడు. ఇంతలో ఏం జరిగిందో ఏమో మద్యం మత్తులో పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సహచరులు గమనించి రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందించారు. అనంతరం వైద్యుల సలహా మేరకు బెంగళూరుకు ఓ అంబులెన్స్‌లో తరలిస్తుండగా, పరిస్థితి విషమించిందని వెంటనే దారిలోని మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
పెద్దతిప్పసముద్రం : మండలంలోని మద్దయ్యగారిపల్లికి చెందిన బిల్లూరు డిష్ నాగరాజు (54) మంగళవారం విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. ఎప్పటిలాగానే నాగరాజు వృత్తి రీత్యా ఓ ఇంట్లో డిష్ కనెక్షన్ ఇచ్చే సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన అతన్ని బి.కొత్తకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అర్ధాంతరంగా తనువు చాలించిన నాగరాజు మృతదేహం వద్ద కుటుంబ సభ్యుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
ఫీల్డ్ అసిస్టెంట్‌కు గాయాలు
చౌడేపల్లె : మండలంలోని లద్దిగం విద్యుత్ ఉప కేంద్రం పరిధిలో మంగళవారం జరిగిన విద్యుత్ ఘాతంలో ట్రాన్స్‌కో ఫీల్డ్‌అసిస్టెంట్ నిరంజన్‌రెడ్డికు గాయాలయ్యాయి. లద్దిగం చెరువు వద్ద గల ఫీల్డ్‌లో మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం జరిగింది. గాయపడిన అతన్ని కుటుంబ సభ్యులు బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
గ్రానైట్ లారీ సీజ్
గుర్రంకొండ : గ్రానైట్ లారీని అధికారులు సీజ్ చేసిన సంఘటన మండల కేంద్రమైన గుర్రంకొండలో జరిగింది. మంగళవారం గ్రామానికి సమీపంలో జిల్లా గనుల శాఖ అధికారులు గ్రానైట్ లారీని తనిఖీ చేసి రికార్డులు సరిగ్గా లేక పోవడంతో సీజ్ చేశారు. ఆ లారీని స్టానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. జిల్లా గనుల శాఖ అధికారులు తదుపరి ఆదేశాల మేరకు చర్యలు తీసుకొంటామని ఎస్‌ఐ రవీంద్రబాబు తెలిపారు.


